జగన్ రెడ్డి అసెంబ్లీకి పోనని గొప్పగా ప్రకటించుకున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొదటి 2014-19 కాలంలో కూడా అదే తప్పు చేశారు. పాదయాత్ర చేయడానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. కనీసం ఎమ్మెల్యేలను కూడా పంపలేదు. తాను లేకుండా ఎమ్మెల్యేలు వెళ్తే వారు ఎక్కడ బాగా మాట్లాడతారో జనం.. జగన్ రెడ్డి కంటే ఈ లీడర్లే బెటర్ గా ఉన్నారని అనుకుంటారోనని భయపడతారు. అందుకే ఎమ్మెల్యేలను కూడా పంపలేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు.
పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలానికి తగ్గట్లుగా మాట్లాడే చాన్స్ వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక్క పక్షం కాబట్టి ఇంకా ఎక్కువే సమయం రావొచ్చు. సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఏ స్పీకర్ అయినా మైక్ ఇస్తారు. కానీ మైక్ ఇవ్వరు అని ముందే ఊహించుకుని తాము మీడియా ముందే మాట్లాడతామని ప్రకటించేసుకున్నారు. జగన్ రెడ్డి ప్రకటన చూసిన తర్వాత చాలా మందికి ఇదేం సమర్థన.. కనీసం ఆలోచన ఉండదా అన్న అనుమానం వచ్చింది.
ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిలో మొదటిది చట్టసభలకు వెళ్లడం. చట్టసభ సభ్యుడిగా ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే.. చట్టసభలకు వెళ్లి చట్టాలు చేసే ప్రక్రియలో పాలు పంచుకోవడానికి.. ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. తమకేదో అక్కడ మైక్ ఇవ్వరని చెప్పి ఎగ్గొడితే అది ప్రజాద్రోహం అవుతుంది. అసలు అసెంబ్లీకే వెళ్లని వారికి ఇక ఎమ్మెల్యే పదవితో పనేముంటుంది. అందరూ రాజీనామాలు చేసి మీడియా ముందు మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యే పదవులు అవసరం లేదు.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును ఏ మాత్రం గౌరవించని నేతల వల్ల చట్టసభలకు ఎలాంటి సమస్యా రాదు.. కానీ వారి రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు అయినా దీన్ని గుర్తించి సభకు వస్తారేమో చూడాల్సి ఉంది.