తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఆయన జిల్లాల పర్యటనలు… శంకుస్థాపనలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నయి. అదే సమయంలో బీజేపీని గురి పెట్టి రాజకీయాలు చేయాలనకుంటున్నారు కాబట్టి జాతీయ అంశాలు టేకప్ చేస్తున్నారంటున్నారు. ఇయితే ఇక్కడ మరో మౌలికమైన అనుమానం అందరికీ ఉంది. కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలంటే.. ఖచ్చితంగా కేంద్రం, గవర్నర్ సహకారం ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లినప్పుడు కేంద్రంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గవర్నర్ నరసింహన్తో ఉన్న సంబంధాల గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసెంబ్లీని రద్దు చేసే ముందు ఢిల్లీ వెళ్లి అందరి అనుమ తీసుకుని.. తరవాత హైదరాబాద్ వచ్చి గవర్నర్ను కలిసి అసెంబ్లీని రద్దు చేశారు. ఇలా గవర్నర్ ను కలిసి అలా పార్టీ ఆఫీసుకు వచ్చేలోపు అసెంబ్లీ రద్దుపై రాజపత్రం విడుదలయింది. ఆ తర్వాత వెంటనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇంత సహకారం ఇప్పుడు ఉంటుందా అన్నదే అసలైన డౌట్ .
కేసీఆర్కు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేవు. గవర్నర్తో కోల్డ్ వార్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ముందస్తుకెళ్లే ఆలోచన చేస్తే.. బీజేపీ ఎలా కావాలంటే అలా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీని రద్దు చేస్తే గవర్నర్ ఆపడానికి అవకాశం లేదు. కొద్ది రోజులు ఆపగిలినా ఆమోదించాల్సిందే. ఆ తర్వాత ఆరు నెలల్లో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించి తీరాలి. అంతకు మించి కేంద్రం… గవర్నర్ అయినా లేటు చేయడానికి లేదు. కానీ ఈ ఆరు నెలల కోసమే కదా కేసీఆర్ ముందస్తుకెళ్లేది అని మరో వాదన. అందుకే… బీజేపీ సహకారం లేకుండా కేసీఆర్ ముందస్తుకు వెళ్లలేరనేది ఎక్కువ మంది వాదన.