మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణకు మహిళలను పిలవొద్దు అంటూ ఆమె సుప్రీంను ఆశ్రయించి, ఈడీ అరెస్ట్ చేయకుండా ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అప్పట్లో సుప్రీం ఇవ్వగా ఫైనల్ హియరింగ్ తో పాటు నిర్ణయం జరగాల్సి ఉంది.
అయితే, గత కొన్ని నెలలుగా ఈ కేసు విచారణ సాగకుండానే పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. డైలీ సీరియల్ తలపిస్తోంది అంటూ స్వయంగా కవితే చిట్ చాట్ లో అన్నారంటే కేసు ఎంత నత్తనడకన ఉందో అర్థం చేసుకోవచ్చు.
కవిత లిక్కర్ కేసు ఈ నెల 13న విచారణకు రాబోతుంది. అదే రోజు కవిత పుట్టిన రోజు కూడా. ఇప్పటికే ఫైనల్ హియరింగ్ అంటూ కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఆ రోజు ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఉత్కంఠ కవితతో పాటు బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని, నేను నిందితురాలిని కాదు… బాధితురాలిని అంటూ కవిత ఎన్నోసార్లు ఆరోపించారు. బీజేపీ కుట్ర కేసుగా… ఈడీ, సీబీఐలు బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తాయంటూ విమర్శించారు. ఇటు బీజేపీ నేతలు కూడా కవిత అరెస్ట్ అవుతారు, లిక్కర్ రాణి అంటూ విమర్శించారు. కవిత ఊచలు లెక్కపెట్టాల్సిందేనంటూ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో కవిత పుట్టిన రోజున కవితకు బీజేపీ-మోడీలు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
కవిత అరెస్ట్ తప్పదు అంటూ బీజేపీ…. బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ చేస్తున్నాయ్ అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న తరుణంలో సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏం జరగుతుందో చూడాలి.