అఖిల్, హలో, మిస్టర్ మజ్ను… ఇలా అఖిల్ పరాజయాల యాత్ర కొనసాగుతూనే ఉంది. ఇది కాకపోతే మరోటిలే.. అనుకుంటూ మూడు సినిమాల వరకూ నెట్టుకొచ్చాడు అఖిల్. కానీ ప్రయోజనం లేకపోయింది. వరుసగా మూడు ఫ్లాపులు కొట్టిన.. వారసత్వ హీరో అఖిలేనేమో. చేతిలో అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, నాగార్జున లాంటి `కింగ్` మేకర్ ఉన్నాడు, పిలిస్తే.. వరుస కట్టే దర్శకులున్నారు కానీ ఏం లాభం? అఖిల్‌లో టాలెంట్ లేదా అంటే… కావల్సినంత ఉంది. డాన్సులు, ఫైటింగులు బాగానే చేస్తాడు. కానీ.. నటన కాస్త మెరుగు పరచుకోవాలి. తొలి నాళ్లలో ఇంతకంటే దారుణమైన `నటన`తో హావభావాలతో నెట్టుకొచ్చినవాళ్లున్నారు. వాళ్లతో పోలిస్తే అఖిల్ బాగా నయం. కానీ… విజయమే చిక్కడం లేదు.
అఖిల్, హలో, మిస్టర్ మజ్ను… ఈ మూడు చోట్లా హంగులూ, ఆర్భాటాలే ఎక్కువగా కనిపించాయి. వినాయక్ ఉన్నాడు, విక్రమ్ కుమార్ ఉన్నాడు అనుకుని తొలి రెండు సినిమాల్నీ లైట్‌గా తీసుకున్నాడు. `తొలి ప్రేమ` లాంటి సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరిని పట్టుకొచ్చి, సేఫ్ గేమ్ ఆడాలని చూశారు. కానీ మూడు సార్లూ వర్కవుట్ కాలేదు. బడ్జెట్ పరంగా.. అఖిల్ సినిమాకి ఎలాంటి పరిమితులూ లేవు. తొలి సినిమాకే రూ.40 కోట్ల వరకూ ఖర్చు పెట్టేశారు. రెండో సినిమా సొంత బ్యానర్లో తీశారు. మూడో సినిమాకీ ధారాళంగానే ఖర్చు చేశారు. కావల్సిన కెమెరామెన్, నచ్చిన సంగీత దర్శకుడ్ని తెచ్చుకున్నారు. కీలకమైన కథ విషయంలో చాలా తప్పులు చేశారు.
అఖిల్‌లో అఖిల్ వయసుకి మించిన పాత్ర అప్పగించారు. తొలి సినిమాలోనే అన్నీ చేసేయాలన్న ఆతృత చూపించారు. దైవాంస సంభూతమైన పాత్ర.. అఖిల్ వయసుకి తూగలేదు. రెండో సినిమా `హలో` లాజిక్కులకు దూరంగా నడిచింది. ఒక్క ఫోన్ నెంబర్ కోసం హీరో అన్ని సాహసాలు చేయాలేంటి? అనుకున్నారు. దాంతో విక్రమ్ లెక్క తప్పింది. మూడో సినిమాకీ అంతే. పాత చింతకాయ పచ్చడితో మానేజ్ చేద్దామనుకున్నాడు. కానీ ఇదీ తుస్సుమంది. కొత్త కథల్ని, కొత్త కాన్సెప్టుల్నీ ఎంచుకోవడంలో నాగ్ సిద్ధహస్తుడు. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించి వాళ్ల నుంచి హిట్ సినిమాల్ని రాబట్టాడు.అఖిల్ నుంచి కూడా అలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు. తన కెరీర్లో కొత్త దర్శకుల్ని ప్రోత్సహించిన నాగ్… తనయుల వరకూ వచ్చేసరికి రిస్క్ తీసుకోలేకపోతున్నాడు. ఆ భయాలు అటు నాగ్, ఇటు అఖిల్ దాటేయాలి. అలాగని నేల విడచి సాము చేసే కథలూ అక్కర్లేదు. అఖిల్ వయసుకి తగిన కథల్ని ఎంచుకుంటూనే అందులో వైవిధ్యం చూపించాలి. అలాంటి కథలు కొత్త దర్శకులు అందించినా – కళ్లకద్దుకుని తీసుకోవాలి. హిట్ దర్శకుల వెంట పడి, వాళ్లిచ్చే రొటీన్ కథలే ప్రసాదం అనుకుంటే.. ఇలాంటి పరాజయాలు మళ్లీ మళ్లీ తలుగుతుంటాయి.