కేసీఆర్, కేటీఆర్ కొద్ది రోజులుగా చెబుతున్న పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేశారు. మూడు గంటల సినిమా అని… గంటకు కుదించామని చెప్పారు. వీటిని న్యాయమూర్తులకు.. సీఎంలకు పంపించామన్నారు. అలాగే ఆ నిందితుల కాల్ లిస్ట్.. 70వేల పేజీల సమాచారం కూడా ఉందన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ లేఖలు.. వీడియోలతో జరిగేదేమీ ఉండదు. ప్రజల్లో ప్రచారం మాత్రం జరుగుతుంది. అవునా అని ఆశ్చర్యపడతారు తప్ప.. వారు చేయగలిగిందేమీ లేదు. ఈ విషయం తరాలుగా నిరూపితమవుతుంది. ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఈ ఆధారాలన్నీ సేకరించిన కేసీఆరే చేయాలి.
ఇప్పటికే ఈ అంశంపై కేసు నమోదయింది కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక్క వ్యక్తికి మూడు ఆధార్ కార్డులు.. పాన్ కార్డులు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలి. గతంలో ఏపీలో జరిగినట్లుగా చెప్పుకున్న డేటాచోరీని హైదరాబాద్ పోలీసులు ఎలా విచారించారో అలాగే.. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టడంపై విచారణ జరపాలి. నిజాలు నిగ్గు తేల్చాలి. ఈ క్రమంలో కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు సాహసోపేతంగా పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం 24 మంది ముఠా అని కేసీఆర్ చెబుతున్నారు. అంటే మొత్తం డీటైల్స్ సంపాదించే ఉంటారు. వారందర్నీ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి.. తక్షణం పెద్దల కుట్రను బయట పెట్టాలి. అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వస్తుందో తేల్చాల్సి ఉంది. అలాగే.. వారు పదే పదే మోదీ, షాల పేరు చెప్పినందున వారికీ నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేయాలి. అప్పుడు మాత్రమే కేసీఆర్ చెప్పిన ఈ కేసులో తార్కిక ముగింపు వస్తుంది. ఈ ఆధారాలన్నింటినీ ప్రజల ముందు పెట్టడం వల్ల .. న్యాయమూర్తులకు పంపడం వల్ల .. జరిగే ప్రయోజనం కొంతే. చట్ట పరంగా ముందుకెళ్లడం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది.
దేశంలో ఇలాంటి కొనుగోళ్ల రాజకీయాలు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ కొనుగోళ్లు ఎక్కువైపోయాయి. ఏ ప్రభుత్వానికీ గ్యారంటీ లేదు. ఉండాలంటే బీజేపీ దయాదాక్షిణ్యాలతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ సాహసంతో బీజేపీని ఢీ కొడుతున్నారని అనుకోవచ్చు. మరి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే కీలకం.