ఎవడే సుబ్రహ్మణ్యం హిట్టయినా నాగ్ అశ్విన్‌కి పెద్ద పేరు రాలేదు. నిజానికి ఆ సినిమాకి దర్శకుడు నాగ్ అశ్విన్ అని చాలామందికి తెలీదు. అయితే ‘మహానటి’తో తన ముద్ర బలంగా వేయగలిగాడు అశ్విన్. చిరంజీవి సైతం సినిమా చేయడానికి ముందుకొచ్చాడంటే.. నాగ్ ప్రతిభా పాటవాలేంటో అర్థం చేసుకోవొచ్చు. ‘మహానటి’ తరవాత నాగ్ అశ్విన్ ఏం చేయబోతున్నాడు? ఎవరి కోసం కథ సిద్ధం చేశాడు? అనేవి ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. చిరంజీవితో సినిమా ఓకే చేసుకోవడం మినహా… అశ్విన్ మరో స్టెప్పు ముందుకు వేయలేదు. ఏ హీరోకీ కథ చెప్పలేదు. కనీసం లైన్ కూడా సిద్ధం చేసుకోలేదు. ప్రస్తుతం అశ్విన్ హాలీడే మూడ్‌లో ఉన్నాడు. కుటుంబంతో కలసి ఆరు నెలలు అమెరికా వెళ్లనున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాకే కథ గురించి ఆలోచిస్తాడట. మరి చిరంజీవి సినిమా ఎప్పుడు? అని అడిగితే.. ”కేవలం లైన్‌గానే అనుకున్నాం. పాత్రలు, కథ అంటూ లోపలకి వెళ్లలేదు. అమెరికా నుంచి తిరిగొచ్చాక… చిరంజీవిగారి కథపై కసరత్తు మొదలెడతా. హడావుడిగా సినిమాలు చేసి, డబ్బు సంపాదించుకునే మనస్తత్వం కాదు నాది. నాకు నచ్చిన పాయింట్ దొరికేంతవరకూ సినిమా గురించి ఆలోచించను” అంటున్నాడు.