ఒకప్పుడు దర్శకుడు శంకర్ పేరు చెబితే.. దేశం మొత్తం గర్వంగా తలెత్తి చూసేది. భారతీయ చలన చిత్రసీమలో కథల్ని, టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు ఆయన. శంకర్ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయని, ఆయనతో సినిమా తీస్తే ఓ సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకొన్నట్టే అని హీరోలు ఫీలైపోయేవాళ్లు. శంకర్ అడిగినంత పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు క్యూ కట్టేవారు. శంకర్ నుంచి కూడా.. అలాంటి అద్భుతాలే వచ్చాయి. ప్రేమికుడు, జెంటిల్మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు.. ఒకదాన్ని మించి మరో విజయం. ఇప్పుడు రాజమౌళి సంపాదించుకొన్న నమ్మకం, క్రేజ్.. ఒకప్పుడు శంకర్ గుప్పిట్లో ఉండేవి. రాజమౌళి కూడా ‘నాకు శంకర్ ఆదర్శం’ అని గర్వంగా చెప్పుకొనేవారు. అలాంటి శంకర్ ఇప్పుడు విజయాల కోసం పాకులాడుతున్నాడు. శంకర్ కథ చెబుతానంటే వినే హీరోలు లేరు. శంకర్ తో సినిమా అనగానే.. నిర్మాతలు కూడా భయపడి పారిపోతున్నారు.
‘ఐ’ సినిమా నుంచే.. శంకర్ తిరోగమనం మొదలైపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ‘ఐ’ పెద్ద డిజాస్టర్. శంకర్ నుంచి ఇలాంటి అవుట్ పుట్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ తరవాత ‘రోబో’ బాగానే ఉన్నా, శంకర్ స్థాయి సినిమా కాదు. ‘రోబో 2’ కూడా నిరాశ పరిచింది. ఆ తరవాత తీసిన ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ శంకర్‌పై నమ్మకాన్ని పూర్తిగా చంపేశాయి. ఈ రెండు సినిమాలతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ తో పెద్ద డామేజీ జరిగింది. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తరవాత రామ్ చరణ్ నమ్మి ఓ ఛాన్స్ ఇస్తే ఇలాంటి సినిమానా తీసేది? అంటూ మెగా అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. దిల్ రాజు బ్యానర్లోనే అతి పెద్ద ఫ్లాప్ గా గేమ్ ఛేంజర్ మిగిలిపోయింది. ‘భారతీయుడు 2’ తాలుకూ గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తు.. క్వాలిటీ పేరుతో రీషూట్లు చేయడం, మూడ్ బాగోకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్లిపోవడం లాంటి ఎగస్ట్రా వ్యవహారాలు నిర్మాతల్ని మరింత ఇబ్బంది పెట్టాయి. కోట్లు కోట్లు పెట్టినా, దానికి తగిన అవుట్ పుట్ రాకపోవడంతో శంకర్ పై నమ్మకాలు పూర్తిగా సన్నగిల్లాయి.
‘గేమ్ ఛేంజర్’ తరవాత శంకర్ సినిమా ఏమిటన్నది ప్రశ్నార్థకమే. ఆయన ఇప్పుడు ‘వేల్పారి’ అనే ఓ తమిళ నవల రైట్స్ తీసుకొన్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు కావాలి. అందుకోసం ఆయన అన్వేషణ ప్రారంభమైంది. తమిళంలో తనకు తెలిసిన హీరోలందర్నీ కలిశారు శంకర్. కానీ ఎవ్వరూ శంకర్ కు డేట్లు ఇవ్వడానికి రెడీగా లేరు. ఒకవేళ హీరో డేట్లు ఇచ్చినా, నిర్మాతలు దొరుకుతారా? అనేది మరో పెద్ద ప్రశ్న. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే కనీసం రూ.500 కోట్లు కావాలట. ‘గేమ్ ఛేంజర్’ లాంటి ఆణిముత్యం చూశాక కూడా శంకర్ పై ఇంత పెట్టుబడి పెట్టే నిర్మాత దొరుకుతాడు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. హీరోలెవరూ దొరకని పక్షంలో ఈ సినిమాని తానే స్వయంగా నిర్మించాలని అనుకొంటున్నాడట శంకర్. అలాగైనా సరే… హీరోలు కావాలి కదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ ని నమ్మేదెవరు? ఛాన్స్ ఇచ్చేదెవరు? అనేదే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా శంకర్ మళ్లీ గాడిలో పడాలంటే.. అద్భుతాలేమైనా జరగాల్సిందే.