పెద్ద హీరోలు స్ట్రాంగ్ లైన్ అప్ తో వుంటున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రెడీగా ఉంటాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్.. వీళ్లంతా దాదాపు నాలుగేళ్ల పాటు డైరీని నింపేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీంతోపాటు దేవర 2 కూడా. రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్ ఆయన కోసం రెడీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయాలి. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా డిస్కషన్ లో ఉంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. అలాగే అట్లీ కూడా ఆయన కోసం ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు. దీంతోపాటు పుష్ప3 ఉంది. ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేతిలో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. రాజాసాబ్ పూర్తికావస్తుంది. సలార్2, కల్కి2, ఫౌజీ వున్నాయి. అలాగే హోంబలే ప్రొడక్షన్ తో రెండు సినిమాల డీల్ కుదుర్చుకున్నారు.
అయితే ఈ బిగ్ లీగ్ లో వున్న మహేష్ బాబు లైనప్ ప్రశ్నార్థకంగా వుంది. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత ఏమిటనేది క్వశ్చన్ మార్క్. నిజానికి రాజమౌళి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలనేది ప్రతి హీరోకి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఆయన సినిమాతో వచ్చే ఇమేజ్, స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అయితే మహేష్ బాబు సమస్య ఇది కాదు. ఆయన ప్లానింగ్ మొదటి నుంచి క్వశ్చన్ మార్కే. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత అది రిలీజ్ అయ్యాక కొంత గ్యాప్ ఇచ్చే మరో కథ వినడం మరో సినిమాని ఓకే చేయడం జరుగుతుంది. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే చొరవ కనిపించదు.
రాజమౌళి తర్వాత మహేష్ సినిమా ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే. 2026లో మహేష్ రాజమౌళి సినిమా రిలీజ్ అయిపోతుందని పక్కాగా చెబుతున్నారు. అయితే ఆ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో జత కడతారు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు. సినిమా రిలీజ్ తర్వాత తీరిగ్గా అలోచించుకునే రోజులు కావివి. ఈ రోజుల్లో క్రేజీ డైరెక్టర్స్ అందరూ ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఈ లీగ్ లో వచ్చే హీరో మహేష్ తో సినిమా చేయదగ్గ క్రేజ్ ఉన్న డైరెక్టర్స్.. ఆల్రెడీ ఈ లీగ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. మహేష్ ఇప్పుడే ప్యుచర్ ప్లాన్ చేసుకొని ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే సమయం కలిసొస్తుంది. మరి మహేష్ ఆలోచన ఎలా వుంటుందో చూడాలి.