కామెడీ ఎంటర్టైనర్స్ తీయడంలో శ్రీనువైట్ల ట్రెండ్ సెట్టర్. అందులో డౌట్ లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు కూడా ఆయన కామెడీకే పెద్ద పీట వేశారు. ఆయన సృష్టించిన కొన్ని పాత్రలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. శేషం, గజాలా, చారి, మెక్ డోనాల్ మూర్తి, దొరబాబు, రాంకీ, పద్మశ్రీ, జయసూర్య, పద్మనాభ సింహ, రివెంజ్ నాగేశ్వరరావు.. ఇలా ఒకటికాదు..ఆయన సినిమాల్లో గుర్తు చేసుకుని మరీ నవ్వుకునే పాత్రలు చాలా వుంటాయి.
అయితే ఇప్పుడా నవ్వులు మిస్ అవుతున్నాయి. ఆయన క్రియేట్ చేసిన పాత్రల్లో మునుపటి మెరుపులు లేవు. బ్రూస్లీ నుంచి మొన్న వచ్చిన విశ్వం వరకూ పరిశీలించి చూస్తే ఐకానిక్ గా అనిపించే ఒక్క పాత్ర కనిపించదు. దీనికి చాలా కారణాలు వున్నాయి. తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ ట్రెండ్ అవుట్ డేట్ అయిపోయినప్పటికీ అదే లూప్ లో తిరుగుతున్నారు. విశ్వం సినిమా అందుకు తాజా నిదర్శనం. తన గత సినిమాల్లో వర్క్ అవుట్ అయిన అన్నీ ఎలిమెంట్స్ ని పెట్టి విశ్వంని ఒక మిక్సర్ పొట్లంలా చుట్టేశారు. ఏదైనా ఒక ట్రాక్ వర్క్ అవుట్ కాకపోదా అనేది ఆయన ప్రయత్నం కావచ్చు. కానీ ఈ ప్రయత్నం ఓ పాత జోక్ లా తయారైయింది.
అయితే శ్రీనువైట్ల నైపుణ్యంపై ఆడియన్స్ కి ఇంకా నమ్మకం వుంది. విశ్వంలో కొన్ని చోట్ల తన షార్ప్ టైమింగ్ కనిపించింది. కానీ ఇదే మూసలో వెళితే లాభం లేదు. ఆయన మొదటగా జోనర్ మార్చి ప్రయత్నించాలి. శ్రీనువైట్ల బలం కామెడీనే. అదే బలంతో ఓ హారర్ కామెడీనీ ట్రై చేయొచ్చు. లేదా డార్క్ కామెడీ బ్యాగ్ డ్రాప్ లో ఓ కథని అనుకోవచ్చు.
కామెడీ ఎంటర్టైనర్స్ లో ట్రెండ్ సెట్ చేసిన ఆయన అదే కామెడీని కొత్తపంధాలో పండించే అవకాశం వుంది. ప్రస్తుతం ఆడియన్స్ కూడా కొత్త ప్రయత్నాలను ఆదరిస్తున్నారు. ఆయన క్రియేట్ చేసిన జయసూర్య క్యారెక్టర్ చెప్పినట్లు.. ఆడియన్స్ ఆయన్ని ఎక్కడో చూడాలని అనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం రొటీన్ లూప్ లో వుంటున్నారు. ఒక్కసారి ఆ లూప్ దాటి ఆయన బయటికి వస్తే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ సిద్ధంగా వున్నారు.