వైఎస్సార్సీపీ ముఖ్యనేతల శాసనసభ్యుల ఆందోళన ఇది. ఫిరాయింపులను తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని గట్టిగా ఖండిస్తూనే తమ నాయకుడి తీరు ఎలా వుంటుందనేది వారు అంచనా వేయలేకపోతున్నారు. ఈ వారంలో చాలా మంది వైసీపీ ముఖ్యులు కలిసినప్పుడు బాహాటంగానే ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘ అప్పటి వరకూ బాగుంటాడు.. ఒకసారి అసెంబ్లీ వేదికపైకి పోయే సరికి మా వాడికి ఆవేశం వచ్చేస్తుంది. సమగ్రంగా ముందు ఆలోచన వుండదు.అనుకున్నవాటికి కట్టుబడీ వుండడు. తెలుగుదేశం వ్యూహాత్మకంగా రెచ్చగొడితే వారి వుచ్చులో పడిపోతాడు అని ఒక ముఖ్యనేత అన్నారు. ఆయన ఎవరి మాట వింటాడు? ఎవరి సలహా తీసుకుంటాడు? ఏం చేయాలి మీరు చెప్పండి. అని ఆ శాసనసభ్యుడు ప్రశ్నించారు. రోజాను ఏడాది పాటు సస్సెండ్ చేయడంపై గట్టిగా నిలదీయాలనుకున్నాం. తర్వాత ఫిరాయింపుల సమస్య వచ్చింది. దానిపై కేంద్రీకరించేలోగానే అమరావతి భూ దందా ముందుకు తెచ్చారు. వీటిలో ఏ విషయం చర్చించడానికీ తెలుగుదేశం సహకరించదని మాకు తెలుసు. అయితే దేనిపై పట్టుపట్టాలో దేనిపై చివరి దాకా నిలబడాలో మాత్రం తెలియదు. ఎందుకంటే ఎక్కువ సార్లు ఆయనే మాట్లాడతారు. హఠాత్తుగా ఎజెండా మార్చి మరేదానిపైకో వెళ్లిపోతారు. ఈ గజిబిజిని పాలకపక్షం బాగాఉపయోగించుకుంటుంది.. సరే ఇంత వరకూ ఎలాగో నడిచిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి అంత బాగాలేదు. ఇప్పుడైనా మా అధినేత జాగ్రత్తగా వుండకపోతే తెలుగుదేశం పండుగ చేసుకుంటుంది.. అని మరో శాసససభ్యుడు వాపోయారు. ఇవన్నీ ఇలా వున్నా కొందరు వందిమాగధులు మాత్రం ఇప్పటికీ జగన్ గొప్పగా వ్యవహరిస్తున్నారని కీర్తిస్తూ పబ్బం గడుపుకొంటున్నారన్నది వారి ఫిర్యాదు. ఖర్చుపెట్టకుండా రాజకీయం నడపాలనుకునే జగన్ ధోరణి అందరినీ దూరం చేస్తున్నది.మరో వైపున తెలుగుదేశం ఆయా ఎంఎల్ఎల అవసరాలు పసిగట్టి మరీ ఎర వేసి లాక్కుంటున్నది. ఒక్కసారిగా పదికోట్లు అయిదు కోట్లు నగదు కళ్లచూసే సరికి పదవుల కన్నా అదే మంచిదని పడిపోతున్నారు. మా వాడు పైస కూడా తీయకుండా పైన ఆర్డర్లు వేస్తే ఎవరు పడుంటారు? అని ఒక కీలక నేత అసలు సమస్య వెల్లడించారు. పైసలతో పాటు వచ్చే ఎన్నికలలో పెద్దగా అవకాశాలు వుండవనే అంచనా కూడా వలసలకు కారణమవుతున్నది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని టిడిపి బిజెపి నమ్మకంగా చెబుతున్నాయి. ఆ రీత్యా కొత్త సీట్లలో పోటీకి అభ్యర్థులను సమకూర్చుకుంటామంటూ ఎంఎల్ఎలను రాబడుతుంది టిడిపి. ఇప్పటికైతే వైసీపీకి ప్రతివ్యూహం పెద్దగా లేదు. అమరావతి అస్త్రంపై ఆశలు పెట్టుకున్నారు. అది నిస్సందేహంగా విచారణ జరిపించాల్సిన విషయమే. అయితే సభా వ్యూహం సరిగ్గా లేకపోతే వాయిదాలు సస్పెన్షన్లతో నడిపించేసే అవకాశం ఇచ్చినవారవుతారు.