మా ఆస్తుల వివరాలు ఇవీ.. అంటూ ప్రకటించే ఓ సంప్రదాయాన్ని ఏడు సంవత్సరాలుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబం పాటిస్తోంది. ప్రతీయేటా తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. నారావారి కుటుంబంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే తక్కువ ఆస్తులు ఉన్నాయని ప్రతీసారీ ప్రకటిస్తున్నారు. ఈసారి కూడా అదే జరిగింది. నారా బ్రహ్మణి, భువనేశ్వరి, దేవాంశ్ పేరిట ఉన్న ఆస్తులన్ని కూడా మంత్రి లోకేష్ తాజాగా లెక్కలు చెప్పారు. తమ కుటుంబ ప్రధాన ఆదాయ వనరు అయిన హెరిటేజ్ విలువ రూ. 3,700 కోట్లు మాత్రమే అన్నారు! ఇతర డెయిరీ సంస్థలు కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎదిగాయన్నారు. అధికారంలోకి వచ్చాకనే తమ ఆస్తులు పెంచుకున్నారనే విమర్శల్ని ముందస్తుగా ఖండిస్తూనే… చంద్రబాబు నాయుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హెరిటేజ్ టర్నోవర్ రూ. 200 కోట్ల నుంచీ రూ. 2 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కూడా వ్యాపారవేత్తే కదా, వారి ఆస్తుల్ని ప్రకటించరా అంటూ పరోక్షంగా సవాల్ చేశారు.
ఈ ఆస్తుల ప్రకటన అనే కాన్సెప్ట్ మంచిదే. గడచిన ఏడేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ఓరకంగా నారావారిని మెచ్చుకోవచ్చు. అయితే, ఇలా వెల్లడించే అంకెల్ని చూసి ప్రజలు నిజంగానే అబ్బురపడుతున్నారా..? చంద్రబాబు కుటుంబ ఆస్తులు లెక్కలన్నీ చాలా పారదర్శకంగా ఉన్నాయని నమ్ముతున్నారా..? అంటే, అవుననీ చెప్పలేం, కాదనీ చెప్పలేం. ఎందుకంటే, రాజకీయ నాయకుల ఆస్తులపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉంటాయి. బినామీలు ఉంటారనీ, కావాలనే లెక్కలు తక్కువ చూపించుకుంటారనీ, విదేశాల్లో దాచి పెట్టుకుంటారనీ… సామాన్యుడిలో ఇలాంటి అభిప్రాయాలు ఎప్పట్నుంచో బలంగా స్థిరపడిపోయాయి. అంటే, ఆ స్థాయి సంపాదన మార్గాలు రాజకీయాల ద్వారా సాధ్యమనే ఓ బలమైన నమ్మకం ఏర్పడిపోయింది.
ఇక, చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటన విషయానికొస్తే… ప్రతీయేటా ఈ సంప్రదాయం కొనసాగించడం వరకూ బాగానే ఉంది. కానీ, దీన్ని వారి పాదర్శకత ప్రదర్శన కంటే… ప్రతిపక్ష పార్టీని విమర్శించే ఓ అవకాశంగానే ఈ సందర్భాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతీసారీ చంద్రబాబుకు తక్కువ ఆస్తులున్నాయని చెప్పుకుంటున్నా… కావాలనే ఇలా ఆయన పేరున తక్కువ ఆస్తులు చూపిస్తున్నారని సహజంగా చాలామంది అనుకుంటారు. చంద్రబాబు పేరున ఆస్తుల విలువ కేవలం రూ. 37 లక్షలేనట! ఇతర కుటుంబ సభ్యుల ఆస్తుల లెక్కలతో చంద్రబాబుకు సంబంధం లేదని ఎవ్వరూ అనుకోరు కదా. చంద్రబాబు వేరు, ఆయన కుటుంబం వేరు అని ఎవరైనా అంటారా..? ప్రతీయేటా తమ పారదర్శకతను ప్రదర్శించుకుంటున్నామని నారావారు అనుకుంటున్నా… ఈ ఆస్తుల ప్రకటన వల్ల కొత్తగా ఒరిగేది ఏముంది..? వారు ప్రకటించే ఆస్తుల వివరాలు అసలైనవి కాదంటూ ఇంకోపక్క వైకాపా విమర్శలు మొదలుపెట్టేసింది. గతంలో, లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల మీద ‘అసలు నిజాలు’ ఇవీ అంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్లీ కొన్నాళ్లీ లెక్కల చర్చ ఉంటుంది. సో… ఇతర పార్టీల నేతల్ని సవాల్ చేయడానికి ఈ ఆస్తుల ప్రకటన అనేది నారావారికి కొంతమేర ఉపయోగపడుతోంది, అంతే.