తొలి సినిమా ‘ఘాజీ’తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఇంత కాంప్లికేటెడ్ సినిమాని భలే తీశాడన్న పేరొచ్చింది. కమర్షియల్గానూ ఈ సినిమా వర్కవుట్ అయ్యింది. అయితే.. రెండో ప్రయత్నం అంత సజావుగా సాగలేదు. `అంతరిక్షం`కి ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ వినిపించాయి. సంకల్ప్ లాజిక్ లేకుండా ఈ సినిమా ఎలా తీశాడంటూ… చాలామంది ప్రశ్నించారు. దీనిపై సంకల్ప్‌రెడ్డి మాట్లాడాడు. ఈ సినిమాపై వచ్చిన అన్ని రివ్యూల్నీ తాను చదివానని, కొంతమంది లాజిక్కులు లేవని రాశారని, లాజిక్కులు పట్టించుకుని తీస్తే… ఈ సినిమా ఓ డాక్యుమెంటరీలా తయారయ్యేదని చెప్పుకొచ్చాడు సంకల్ప్. రివ్యూల్ని తాను పాజిటీవ్‌గానే తీసుకున్నానని, అయితే కొన్ని రివ్యూలు ఎందుకు అలా రాశారో అర్థం కాలేదని చెబుతున్నాడు.
”ఇలాంటి సినిమాని ఇంత బడ్జెట్లో తీయడం చాలా పెద్ద విషయం. ఈ సినిమా గురించి వస్తున్న ప్రశంసలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. విమర్శల్నీ నేను స్వీకరిస్తున్నా” అన్నాడు. వరుణ్ తేజ్ కూడా ఇదే మాట చెప్పుకొచ్చాడు. ”ప్రతీ సినిమాలోనూ కొన్ని తప్పొప్పులు జరుగుతాయి. భవిష్యత్తులో వాటిని పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడతా” అన్నాడు వరుణ్. లాజిక్కులు పట్టించుకుంటే మ్యాజిక్ చేయలేమన్నది దర్శకుల మాట. అది నిజమే. కాకపోతే ఓ సైన్స్ ఫిక్షన్ చేస్తూ.. లాజిక్కులు పట్టించుకోకపోతే ఎలా?? కమర్షియల్ సినిమాల్లో ఎలాగూ లాజిక్కులు ఉండవు. సైన్స్ ఫిక్షన్లూ అలానే తీస్తే… విమర్శల పాలవ్వాల్సివస్తుంది. ఈ విషయాన్ని సంకల్ప్ లాంటి యువ దర్శకులు గుర్తిస్తే మంచిది.