తన పుట్టినరోజున కుటుంబ సభ్యులందరూ తన ఇంట్లో కళ్ళ ముందు వుండాలనేది చిరంజీవి కోరిక. “నాన్నకి ఎవరూ ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వవలసిన అవసరం లేదు. డాడీ బర్త్‌డేకి అందరం ఇంటికి వస్తే ఆనంద పడతారు. అందువల్ల, ఆగస్టు 22న మా కుటుంబ సభ్యులు అందరూ మా ఇంటికి చేరుకుంటాం. అదే ఆయనకు మేమిచ్చే చిరు బహుమతి” అని మెగా కుమార్తెలు సుస్మిత, శ్రీజ తెలిపారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పత్రికతో ఇద్దరూ మాట్లాడారు. రెండేళ్ల క్రితం చిరంజీవి 60వ పుట్టినరోజును ఘనంగా సెలెబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ, ఈ ఏడాది బర్త్‌డేకి ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేయలేదట. పుట్టినరోజుకి ఒక్క రోజు ముందు ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ విడుదల చేస్తున్నారు. దాంతో సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని చిరంజీవి కుమార్తెలు తెలిపారు. సాధారణంగా మెగాస్టార్ బర్త్‌డే ఆయన సిస్టర్స్ తీసుకొచ్చే కేక్ కట్టింగ్‌తో మొదలవుతుందట. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేశాక… ఉదయం ఫ్యామిలీ అందరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కణ్ణుంచి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానుల రాకతో రోజంతా కోలాహలంగా, సందడిగా, పండగలా మారుతుందని సుస్మిత, శ్రీజ తెలిపారు.