ఏకపక్షంగా టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ ప్రకాష్ రాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ని ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసైనికులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తూ ఉండడం వల్ల, జనసేన ని విమర్శిస్తూ మరొక వర్గం నెటిజన్లు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలుస్తూ ఉండడంవల్ల ఈ టాపిక్ హాట్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ కారణంగా ప్రకాష్ రాజ్ కి సంబంధించి పలు విషయాలు తెరమీదకు వస్తున్నాయి. కెసిఆర్ కు టిఆర్ఎస్ కు ప్రకాష్ రాజ్ మద్దతు పలకడం వెనుక అసలు మతలబు ఇది అంటూ పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి . వివరాల్లోకి వెళితే..
దేశ రాజకీయాల్లోనే పెద్ద ఊసరవెల్లి అయిన కెసిఆర్ కు మద్దతు ఎందుకు అంటూ ప్రశ్నలు:
పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పక్షాలతో పోటీ చేశాడని,తో, కానీ ఎన్నికల తర్వాత బిజెపికి మద్దతుగా నిలుస్తున్నారు అని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు కాకపుట్టించాయి. అయితే కెసిఆర్ కు బలమైన ప్రతిపక్షం గా మారిన బిజెపి జనసేన కూటమిని విమర్శించాలనే ఉద్దేశంతోనే టీవీ9 ఏర్పాటుచేసిన ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలు చేసే ముందు సరైన హోంవర్క్ చేయలేదనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి విడిపోయి టిఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్, కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకానొక సమయంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. జాతీయ పార్టీలతో పని చేయడమే తప్పు అని వాదించే ప్రకాష్ రాజ్, తాను ఏకపక్షంగా మద్దతు ఇస్తున్న కేసీఆర్ గతంలో కాంగ్రెస్ లాంటి అతి పెద్ద జాతీయ పార్టీలో మంత్రిగా పని చేయడాన్ని మర్చిపోవడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే కథ అక్కడితో అయిపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ ఆ తర్వాత, కాంగ్రెస్ తో పొత్తు తెంచుకుని, టిడిపి తో పాటు జాతీయ పార్టీ అయిన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు తో ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోందని ఎన్డీయే కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనే జాతీయ పార్టీతో పొత్తు తెంచుకొని కమ్యూనిస్టులు అనే జాతీయ పార్టీతో ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికలయ్యాక ఫలితాలు రాకముందే బిజెపి అనే మరొక జాతీయ పార్టీకి మద్దతుగా మాట్లాడిన కేసీఆర్ కు మించిన ఊసరవెల్లి దేశ రాజకీయాల్లో ఇంకెవరైనా ఉన్నారా అని, అటువంటి కెసిఆర్ కు మీరు మద్దతు తెలుపుతారా అంటూ ప్రకాష్ రాజ్ ని ప్రస్తుతం నెటిజన్లు విమర్శిస్తున్నారు.
టిఆర్ఎస్ కు ప్రకాష్ రాజ్ మద్దతు వెనుక అసలు మతలబు ఇదేనా అంటూ విమర్శలు:
ప్రకాష్ రాజ్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం పై అప్పట్లో తెలుగు మీడియా విస్తృత ప్రాచుర్యాన్ని కూడా కల్పించింది. అయితే తాను దత్తత తీసుకున్న గ్రామానికి సమీపంలోనే ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ ఉంది అన్న విషయం ఇప్పుడు తెరమీదకు వస్తోంది. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న తన ఫాంహౌస్, తన భూములు, తెలంగాణలోని తన ఇతర ఆస్తులు కాపాడుకోవడానికే అప్పట్లో ప్రకాష్ రాజు టీఆర్ఎస్ మద్దతు కోరాడని, టిఆర్ఎస్ పెద్దలని మెప్పించడానికి కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు అని, దత్తత తీసుకొని దాదాపు ఐదేళ్లు పైగా గడిచినప్పటికీ ఆ గ్రామానికి ప్రకాష్ రాజ్ ఏ సహాయము చేయలేదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సాయం చేయడం చేయకపోవడం ఆయన వ్యక్తిగతమని, అయితే తానేదో సంఘసంస్కర్త లా పోజు కొడుతూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నప్పుడు తను నిజంగా సహాయం చేశారా చేయలేదా అని ప్రశ్నించే హక్కు తమకు ఉందని వారు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలను బిజెపి నుండి కాపాడడానికి నడుం బిగించిన ప్రకాష్ రాజ్, వరదల్లో మునిగిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు?
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో బాగా హైలెట్ అవుతున్న అంశం ఇది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రకాష్ రాజ్, జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు సడన్గా టీవీ9 స్టూడియో లో దిగడం, వారికి సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక కారణాలు అర్థం కానీ ప్రేక్షకుల కోసం ఆయనే వివరణ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలను బిజెపి జనసేన కూటమి నుండి కాపాడడానికి తాను నడుం బిగించినట్లు ఆయన మాటల్లో అర్థమవుతోంది. అయితే సామాన్య ప్రజల నుండి ఎదురవుతున్న ఒక సింపుల్ ప్రశ్న ఏంటంటే – హైదరాబాద్ ప్రజలను ఎన్నికల సమయంలో బిజెపి నుండి కాపాడడానికి ఇంత ధీరోదాత్త మైన పోరాటం చేస్తున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ ప్రజలు వరద నీటిలో మునిగి పోయి విలవిలలాడుతున్నపుడు సహాయం ఎందుకు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు విరాళం ప్రకటించిన ప్రకాష్ రాజ్, తనను నెత్తి మీద పెట్టుకున్న తెలుగు ప్రేక్షకులు, హైదరాబాద్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు ఎందుకు మొహం చాటేశారు అని వారు అడుగుతున్నారు.
మొత్తం మీద చూస్తే, టిఆర్ఎస్ కు మద్దతు పలకడానికి మొన్న పోసాని ఇవాళ ప్రకాష్ రాజ్ ఉబలాట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ విషయంలో తెలంగాణ ప్రాంతంలోని తన ఫాంహౌస్, భూములు కాపాడుకునే విషయంలో టిఆర్ఎస్తో అంతర్గతంగా అవగాహన ఉందని, ఆ కారణంగానే టిఆర్ఎస్ పార్టీకి ప్రకాష్ రాజు బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలు ప్రత్యారోపణల పై ప్రకాష్ రాజ్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి