వంగవీటి రాధా… ప్రజల్లో అభిమానం ఉన్నా, దాన్ని రాజకీయ జీవితానికి అనుగుణంగా మార్చుకోలేకపోయారనే చర్చ ఇప్పుడు వంగవీటి అభిమాన వర్గాల్లో మరోసారి జరుగుతోందని సమాచారం. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఆయన వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరుతో విసిగిపోయాననీ, తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆగ్రహంతో ఆయన పార్టీని వీడారు. అయితే, ఆ సమయంలో పార్టీ మారొద్దని వంగవీటి అభిమానులు రాధాకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. పార్టీ నుంచి ఆయనకు సీటు దక్కలేదు! పోటీకి దూరంగానే ఉండాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు రాధా అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమౌతోంది. అధికారంలో లేకపోయినాసరే, టీడీపీలో రాధాకి ప్రాధాన్యత పెంచుతారా, పార్టీలో కీలక స్థానం కలిస్తారా లేదా అనే చర్చ మొదలైనట్టు సమాచారం.
ఏదో ఒక పార్టీని నమ్ముకుని, దాన్లోనే కొనసాగి ఉంటే ఏ నాయకుడికైనా ఒక టైం వస్తుంది. కానీ, రాధా పరిస్థితి అందుకు పూర్తి భిన్నం అనొచ్చు. ఎందుకంటే, ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మారాల్సిన పరిస్థితులు ఆయనకి ఎదురయ్యాయి. వంగవీటి రంగా వారసుడిగా రాధా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004లో వైయస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ఆయన వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. ఆ సందర్భంలో ప్రజారాజ్యం రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేస్తుందనే అంచనాలూ అలానే ఉండేవి. 2009లో విజయవాడ సెంట్రల్ నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన రాధా… కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. మరోసారి వైయస్సార్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత, కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమైపోయింది. అలాగని కాంగ్రెస్ పార్టీలోకి మరోసారి వెళ్లలేకపోయిన రాధా… వైకాపాలో చేరాల్సి వచ్చింది. అక్కడా ఇమడలేక గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి రావాల్సి వచ్చింది.
కారణాలు వేర్వేరుగా ఉన్నా ప్రతీ ఎన్నికలకు ముందు రాధా పార్టీ మారుతూనే వచ్చారు. ఈ వైఖరి వల్లనే రాధా పొలిటికల్ కెరీర్ ప్రభావవంతంగా లేకుండాపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో, ఇవన్నీ విశ్లేషించుకుని రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి రాధా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి కొంత నెలకొంది. ఎన్నికల ముందు పార్టీ మారే పరిస్థితి లేకుండా చేసుకుని, మరో ఐదేళ్ల విజన్ తో ఇప్పట్నుంచే వ్యూహత్మకంగా ముందుకెళ్తే రాధా కచ్చితంగా రాజకీయంగా కూడా కీలకంగా మారుతారనేది ఆయన అభిమానుల అభిప్రాయం.