రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసిన కేంద్రంఈసారి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అయితే ఇలా నలుగురికి చాన్సివ్వగానే అందరూ దక్షిణాదిపై బీజేపీ కన్నేసిందనే ప్రచారాన్ని ఉధృతం చేశారు. కానీ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురికి రాజకీయ నేపధ్యం లేదు. కాకపోతే వారి వారి రంగాల్లో దిగ్గజాలుగా ఉన్నారు. అంత మాత్రాన వారికి రాజకీయ లాభం కలుగుతుందా అంటే..ఎలా సాధ్యమని సులువుగానే అంచనా వేయవచ్చు. కేంద్రం వివిధ పద్దతుల్లో దక్షిణాదికి రావాల్సిన పదవులను ఉత్తరాదికి కేటాయిస్తోంది.
ఈ కారణంగా అసంతృప్తి రాకుండా నలుగురికి దక్షిణాది వారికి ఇచ్చింది. అంత మాత్రాన వారికి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లభించదు. విజయేంద్ర ప్రసాద్‌కు ఇచ్చారని ఆయన కుటుంబం అంతా బీజేపీలో చేరిపోయి ప్రచారం చేయదు కదా ! పీటీ ఉష కానీ.. కర్ణాటకలో ధర్మస్థలి ధర్మకర్త కానీ బీజేపీలో చేరరు. అయితే బీజేపీ ఏం చేసినా రాజకీయ కోణంతోనే చేస్తుందని… రాజకీయ లాభం చూసుకుంటుదన్న అభిప్రాయం ఉండటంతో అందరూ విశ్లేషణలు చేసేస్తున్నారు.
కానీ రాజ్యసభకు వెళ్తున్న వారు నిజంగా బీజేపీలో సభ్యులు కూడా కాదు. అవరు కూడా. ఎందుకంటే వారు వివిధ కేటగిరీల్లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ పార్టీ సానుభూతిపరులుగా ఉంటారేమో కానీ.. వారి వల్ల ప్రత్యేకంగా లభించే రాజకీయ ప్రయోజనం బీజేపీకి ఉండదు. ఈ పాటికి బీజేపీ దక్షిణాది వారికి చాన్స్ ఇచ్చిందని సంతోషపడవచ్చు. అంతకు మించి ఆ పార్టీ ఏదో రాజకీయంగా సాధించేస్తుందని.. ఆ కోణంలోనే పదవులు ఇచ్చిందని అనుకోవడం మాత్రం అతే.