ఆంధ్రప్రపదేశ్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోంది. నిమ్మగడ్డ హయాంలో నిర్వహించకూడదని అనుకుంటోంది. అందు కోసం అధికారం లేకపోయినా రాజ్యాంగ సవరణలు చేయడానికి కూడా సిద్ధ పడుతోంది. ఇంత ఉల్లంఘనలు ఎందుకు పాల్పడాల్సి వస్తుందో.. వైసీపీ నేతలకే అర్థం కావడం లేదు. మహా అయితే.. ఎస్ఈసీ ఎన్నికలను కఠిన నిబంధనలను అమలు చేసి నిర్వహించగలరు కానీ..ప్రభుత్వానికి వ్యతిరేకగా ఓట్లు వేయమని ఆదేశాలు ఇవ్వలేరని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలు ఓట్లేస్తారనే భరోసా ఉన్నప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తే ఏమిటన్న అనుమానం ఇప్పుడే సాధారణ ప్రజల్లో కూడా ప్రారంభమయింది.
నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయిన మరుక్షణమే స్థానిక ఎన్నికలు..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ గా ఉన్న కాలంలో ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు తమను రాజకీయంగా ఇబ్బందులు పెడతాయని ప్రభుత్వం అనుకుంటోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టుకు వెళ్లింది. కానీ స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎన్నికల జరపకుండా ఉండేందుకు శాసన అధికారాన్ని ఉపయోగించింది. కరోనా కారణంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ తీర్మానం చేయడమే కాకుండా ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని తనకు దఖలు పరుచుకుంటూ తీర్మానం పేర్కొంది. దీనికి తగ్గట్లుగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
న్యాయపరిధిలో శక్తిమేర పోరాడుతున్న నిమ్మగడ్డ..!
రాజ్యాంగం, సుప్రీంకోర్టు, పలు హై కోర్టు తీర్పులు ప్రకారం ఇటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయినా అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజున అకస్మాత్తుగా ఈ తీర్మానాన్ని తెరపైకి తీసుకువచ్చి హడావుడిగా ఆమోదించేసింది. ఇలా చేయడం వలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షలో నిలబడుతుందా…? లేదా అనే సందేహం ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది మార్చి వరకు గడిపేస్తే అప్పటికి నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం గవర్నర్ కు లేఖ రాశారు. 243 కె అధికరణం కింద కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగస్పూర్తికి విరుద్దమని, అటువంటి ఆర్డినెన్స్ ఏదైనా వస్తే తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయవాదుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
ప్రభుత్వం నియమించే ఎస్ఈసీ నిజాయితీగా ఎలా నిర్వహిస్తారు..!?
నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అది నిజమో కాదో..కానీ ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తే కోర్టుకెళ్లే హక్కు అధికార పార్టీకి ఉంది. అదే సమయంలో.. కొత్త ఎస్ఈసీని నియమిస్తే… ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పని చేయరని గ్యారంటీ ఏముంది…? ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నిమ్మగడ్డనే మొదట్లో. నోరు మెదపలేకపోయారు. అక్రమాలను తట్టుకోలేక.. తన మనస్సాక్షి అంగీకరించకఆయన ఎన్నికల్ని వాయిదా వేశారు. ఈ కారణంగానే ఆయనపై జరిగిన దాడిఅంతా ఇంతా కాదు. ఒక వేళ నిమ్మగడ్డ కాకుండా.. వైసీపీ నియమించిన ఎస్ఈసీ ద్వారా ఎన్నికల్ని జరిపిస్తే.. టీడీపీ గెల్చినా గెలుపు ధృవపత్రం మాత్రం వైసీపీ నేతలకు ఇవ్వరన్న గ్యారంటీ కూడా ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు. నిజాయితీగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చే్స్తున్నారు.