యువ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం.. టాలీవుడ్ కి గట్టి షాకే ఇచ్చింది. పాత్రికేయుడిగా వచ్చి, పీఆర్వోగా మారి, నిర్మాతగా ఎదిగిన మహేష్.. ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. యేడాదికి మూడు సినిమాల చొప్పున తీస్తూ – ప్రారంభంలోనే తనజోరు చూపించేశారు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. నరేష్ తో `సభకు నమస్కారం`, నాగశౌర్యతో `పోలీసు వారి హెచ్చరిక`తో పాటు సందీప్ కిషన్ సినిమాలు ఆయనఖాతాలో ఉన్నాయి.
సభకు నమస్కారం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. `పోలీసు వారి హెచ్చరిక` ప్రీ ప్రొడక్షన్ స్థాయిలోనే ఉంది. ఇక సందీప్ కిషన్ సినిమా ఒక్కటే సగం పూర్తయి ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు టేకప్ చేస్తారన్నదే అసలు ప్రశ్న. సగం సినిమా కాబట్టి… అలా వదిలేయలేరు. అలాగని పూర్తి చేయలేరు. ఎందుకంటే… మహేష్ కోనేరుకి ఇండ్రస్ట్రీలో చాలా అప్పులున్నాయట. ఒకవేళ.. సందీప్ కిషన్ సినిమా పూర్తి చేస్తే.. విడుదల సమయంలో అప్పులవాళ్లంతా వచ్చి మీద పడతారు. కాబట్టి… ఆ ధైర్యం ఎవరూ చేయరు. నరేష్, శౌర్య సినిమాలకు మహేష్ అడ్వాన్సులు ఇచ్చేశాడు. దాంతో పాటుగా.. ఆయా సినిమాల శాటిలైట్, హిందీ డబ్బింగులు ఇస్తానని… కొంతమంది దగ్గర మహేష్ ఫైనాన్స్ తీసుకున్నాడు. కాబట్టి.. ఆయా సినిమాలు ఎవరు టేకప్ చేసినా – మహేష్ అప్పుల భారం వెంటాడుతుంది. కాబట్టి.. ఈ మూడు సినిమాల్నీ ఇక మర్చిపోవాల్సిందే.