ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. నిరసన అంటే… ముందుగా బంద్ అనేదే గుర్తుకొస్తుంది. బంద్ వల్ల నిరసన వ్యక్తం చేయడం అంటే.. ప్రజలను ఇబ్బంది పెట్టడమే. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటో.. దాన్ని ప్రతిపక్ష నేత ఎలా సమర్థించుకుంటారో అర్థం కావడం లేదు. ప్రత్యేకహోదా ఉద్యమం ప్రారంభమైన తర్వాత.. తను పాదయాత్రలో ఉన్నప్పుడే.. అంటే.. ఈ ఆరునెలల కాలంలోనే ఆయన మూడు, నాలుగు సార్లు బంద్‌కు పిలుపునివ్వడమో… ఇతరులు ఇచ్చిన పిలుపునకు మద్దతు ఇవ్వడమో చేశారు. ఈ బందుల్ని నిర్వహించినప్పుడు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందో అందరూ చూశారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బంద్‌నకు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లు సాధన విషయంలో బంద్ చేయడం పరిపాటి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయం భిన్నమైనది. కేంద్రంపై ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా కోసం.. రాష్ట్ర ప్రభుత్వం మీద సమరం చేస్తున్న విపక్షాలు ఉన్నాయి. కేంద్రానికి సెగ తగలాలంటే.. ఏపీ బంద్ చేయడం ఎంత వరకు న్యాయం..? కూలీలు రోజావారీ ఆదాయం కోల్పోతారు. చిరు వ్యాపారులు ఒక రోజు ఉపాధి కోల్పోతారు. అంటే బంద్ వల్ల నష్టపోయేది బడుగులే. దీని వల్ల ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ శాఖకూ ఇబ్బంది ఉండదు. మరి జగన్ ఎందుకు ఏపీ బంద్‌కు పిలుపునిస్తున్నారు..?
కేంద్రప్రభుత్వానికి నిరసన తెగ తగలాలంటే.. దానికి సంబంధించి వేరే కార్యాచరణ చేపట్టాలి. రాష్ట్రానికి మంచి చేయాలని..డిమాండ్ రాష్ట్రాన్ని గాయపరుచుకుంటామా..?. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత విధానం ఇంతే ఉంది. తన రాజకీయ తెంపరి నిర్ణయాలను ప్రజలపై రుద్ది.. బలవంతంగా.. కొంత మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్పా… బంద్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇతర దేశాల్లో నిరసన వ్యక్తం చేయాలంటే.. ఎక్కువ పని చేయాలని ఆలోచిస్తారు. కానీ ఇండియా ముఖ్యంగా ఏపీలో మాత్రం.. బంద్ అంటూ రాజకీయ రచ్చ ప్రారంభించారు. ఈ విషయంలో జగన్ రాజకీయ పరిపక్వత లేదని.. పదే పదే నిరూపించుకుంటున్నారు.