బీఆర్ఎస్ నుంచి అర్థరాత్రి పూట ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక్కడా కాంగ్రెస్ పార్టీ విలీన వ్యూహానికి తగ్గ ఫలితం సాధించలేదు. మండలిలో బీఆర్ఎస్కు 29 మంది ఎమ్మెల్సీ లు ఉన్నారు. వారిలో 20 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే విలీనం చేసుకోవచ్చు. కానీ ఆరుగులే వచ్చి చేరారు. రేవంత్ తో వరంగల్ పర్యటనలో సమావేశమైన బండ ప్రకాష్ ముదిరాజ్ కూడా చేరేందుకు రాలేదు. అంటే.. మ్యాగ్జిమం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తే ఆరుగురు పార్టీలో చేరారనుకోవచ్చు. ఇంకా ఒత్తిడి చేస్తో మరో నలుగురు ఐదుగురు చేరుతారేమో.. మరి విలీనం కాదు.. ఫిరాయింపులే అవుతాయి.
ఆరుగురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు కోసం బీఆర్ఎస్ ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే… మండలి చైర్మన్ బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డినే. కానీ ఆయన బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. కొడుకుని కాంగ్రెస్ లో చేర్పించారు. అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ స్పీకర్లు పెట్టిన సంప్రదాయాల్ని అంటే ఫిరాయింపు దార్లపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కొనసాగిస్తారు. మరి బీఆర్ఎస్ నేత అయిన గుత్తా ఏం చేస్తారు ?
గుత్తాతో మాట్లాడే .. ఎమ్మెల్సీల ఫిరాయింపులు చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చే ఒత్తిళ్లు… అనర్హతా పిటిషన్లను పట్టించుకోకుండా ఉండేలా గుత్తాతో మాట్లాడితేనే వారు కాంగ్రెస్ లో చేరి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇలా చేయడం గుత్తాకు కూడా నైతికత కాకపోవచ్చు. కానీ రాజకీయాల్లో అలాంటివేమీ ఉండవు కదా !