హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా, నిర్ణయాత్మకంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రణాళికే రచించారని అంటున్నారు. ఇప్పటికే కాపు కులానికి చెందిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండటంతో, వారిద్దరికీ దీటుగా అదే కులానికి చెందిన దాసరిని తమవైపు తిప్పుకుని ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికలలో వైసీపీకి లభించే ఒక సీటును ఎరగా చూపించి దాసరిని తమ పార్టీలోకి లాక్కోవాలని జగన్ యోచనగా చెబుతున్నారు. అందుకే నిన్న స్వయంగా వెళ్ళి దాసరిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే దాసరి తన స్పందనను ఇంకా తెలియజేయలేదు. భవిష్యత్తు జగన్‌దేనని, ప్రతిపక్ష నాయకుడిగా బాగా పనిచేస్తున్నాడని మాత్రం అన్నారు. జగన్ మంచి నాయకుడిగా ఎదుగుతున్నాడని, అతనికి తన దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.
బొగ్గు కుంభకోణంలో ఇరుక్కున్న దాసరి, కొద్దిరోజుల క్రితం రాజకీయాలలోకి వెళ్ళి తప్పు చేశానని, ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. మరి ఇప్పుడు ఆయన మనసు మార్చుకుంటారా, లేక జగన్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఆయన పవన్ కళ్యాణ్‌తో త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ జగన్ పార్టీలో చేరితే పవన్-జగన్ ఇద్దరితో స్నేహాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.