రామోజీరావు ఎవరు .. ఆయన ఓ మీడియా చానల్ ఓనర్ మాత్రమే. ఆయనకు సంస్మరణ ఏమిటి అని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చర్చ పెట్టారు. ఈ చర్చలు రామోజీరావును చాలా సాధారణ వ్యక్తిగా.. ఓ సామాజికవర్గ ప్రతినిధిగా చెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనకు ప్రభుత్వం ఖర్చు పెట్టి సంస్మరణ చేయడం తప్పన్నట్లుగా వాదించారు. అయితే అలాంటి వాదనే ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వినిపించడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ వాదనను ఆయన మొదటి సారి సమర్థించారు. అదీ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చాక. రామోజీ గొప్పతనాన్ని గుర్తించడానికి ఆయన ఎందుకు మనసు రాలేదో కానీ.. రామోజీరావుకు ప్రభుత్వ సంస్మరణ నిర్వహించడం నూటికి నూరు శాతం కరెక్ట్.
ఎన్టీఆర్ తర్వాత తెలుగు సమాజంపై అంతటి ప్రభావం చూపిన వ్యక్తి రామోజీ
తెలుగు సమాజంపై ఎన్టీఆర్ ముద్ర ఎంత ఉందో రామోజీరావుది కూడా అంతే ఉంటుంది. ఎన్టీఆర్ నేరుగా సినీ, రాజకీయ రంగాల్లోకి వచ్చి ప్రజా జీవితాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నించారు. ఆయనది ప్రత్యక్ష ముద్ర అయితే…. దాని వెనుక ఉన్న శక్తి రామోజీరావు. ఆయనది పరోక్ష ముద్ర. రామోజీ నేరుగా ప్రజా జీవితంలోకి రాలేదు.. కానీ ఆయన ప్రభావం మాత్రం.. తెలుగు సమాజంపై మరో వందేళ్లు అయినా ఉంటుంది. ఆ విషయం ఆర్కేకు తెలియనిది కాదు. తెలుగు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు.. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదం రామోజీ నుంచే వచ్చిందనే సంగతిని మర్చిపోకూడదు. మీడియాలో ఆయన ముద్ర … దేశంలో ఎవరూ వేయలేనిది కూడా. హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్ చేసుకునే స్టూడినయోను నిర్మించిన ఘనత రామోజీకి సొంతం. చెప్పుకుంటూ పోతే.. రామోజీ రావు తెలుగు ప్రైడ్ అని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలోనే దూరదర్శన్ లో ఆయన విజయాలు, విజన్‌పై 35 ఏళ్ల కిందటనే డాక్యుమెంటరీ వేశారంటే ..ఆయన ముద్రను ఇప్పుడు మనం తక్కువ చేయగలమా ?. ఉద్దేశపూర్వకంగా మర్చపోగలమా ?
కులం, రాజకీయం కారణంగానే కొంత మందికి ద్వేషం
రామోజీరావును కులం కారణంగా… ఆయన రాష్ట్రం కోసం తీసుకున్న మీడియా విధానాల వల్ల మాత్రమే కొంత మంది ఆయనను వ్యతిరేకిస్తారు. అంతే కానీ ఆయనకు సంస్మరణ ప్రభుత్వం తరపున నిర్వహించవద్దని ఒక్కరూ అనుకోరు. తెలుగు రాష్ట్రాలకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు.. తెలుగు జాతికి ఆయన చేసిన మేలు గురంచి కనీస అవగాహన ఉన్న వారెవరూ వ్యతిరేకించలేదు.. ఇంకా హర్షించారు కూడా. రామోజీరావుకు ఆయన చేసిన సేవల ప్రకారమే కాదు… హోదా ప్రకారం కూడా అర్హత ఉంది. ఆయన దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణుడు. ఆయనను గౌరవించడం.. ఆయన సంస్మరణ నిర్వహించడం అంటే.. తెలుగువారు తమను తాము గౌరవించుకున్నట్లే.
రామోజీపై వ్యతిరేకత ఆర్కే వ్యక్తిగత ద్వేషమే !
రామోజీ సంస్మరణపై వైసీపీ వాదనతో ఏకీభవించిన ఆర్కేది వ్యక్తిగత ద్వేషమే. కొన్నాళ్ల పాటు ఆయన చానల్లో .. పేపర్లో రామోజీ వార్త రాకుండా బ్యాన్ చేశారని మీడియాలో పని చేసిన చాలా మందికి తెలుసు. ఆయనతో ఎక్కడ చెడిందో కానీ… మీడియా విలువల విషయంలో , ఉద్యోగుల సంక్షేమం విషయంలో రామోజీతో పోల్చుకునే అర్హత కూడా ఆర్కేకు ఉండదు. ఆంధ్రజ్యోతి లో పని చేసి బయటకు వెళ్లే వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆర్కే గురించి కానీ.. ఆంధ్రజ్యోతి సంస్థ గురించి కానీ మంచిగా చెప్పరు. కానీ ఈనాడులో పని చేసిన బయటకు వెళ్లిన వారిలో రామోజీరావును ద్వేషించే వారు దాదాపుగా ఉండరు. జర్నలిస్టులకు ఆయన ఇచ్చే విలువ ఏంటో అందరికీ తెలుసు. రామోజీరావు సంస్మరణకు మీడియా దిగ్గజంగా గుర్తించి తనను పిలవలేదని ఆర్కే ఫీలయినట్లుగా ఉన్నారు. హిందూ పత్రిక, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్లను పిలిచి తనను మాత్రం గుర్తించలేదని కోపం తెచ్చుకుని రాసినట్లుగా ఉన్నారు.
జర్నలిజం… అభిప్రాయాలు వ్యక్తిగత,రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆర్కేలో అది కనిపించడం లేదు. ఆయన వైసీపీ వాదనతో ఏకీభవించినంత మాత్రాన.. రామోజీరావును తక్కువ చేయలేరు. ఆయన సంస్మరణను ప్రభుత్వం నిర్వహించడం తప్పనలేరు.