రేవంత్ రెడ్డి సహజంగా… కామ్‌గా ఉండటం అంటే..అది ఆశ్చర్యమే. మేము శాసనమండలిలో రెండేళ్లు కలసి పని చేశాం. బాగా మాట్లాడే వ్యక్తి. కానీ ఆయన ఇటీవలి కాలంలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిందే.. కేసీఆర్‌పై యుద్ధం చేద్దామని..!. కానీ ఎప్పుడో ఒకసారి.. ప్రకటనలు చేయడమే తప్ప.. కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఎక్కడా చెలామణి కావడం లేదు. ఎందుకిలా జరుగుతోందన్నదానిపై.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ డామినేట్ చేస్తాడని ఇతర కాంగ్రెస్ నేతల భయమా..?
కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. రాజకీయాల్లో పవర్‌ఫుల్‌గా కేసీఆర్‌ను ఎటాక్ చేయాలి. కేసీఆర్‌ను బలంగా ప్రశ్నించకుండా.. విమర్శించకుండా.. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతోంది… అన్నది అందరికీ వస్తున్న సందేహం. కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరైనా ఒక నేత పార్టీలోకి వస్తారంటే… అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న నేతలు తీవ్రంగా అడ్డు పడతారు. దానికి నాగం జనార్దన్ రెడ్డి చేరిక వ్యవహారమే ఉదాహరణ. రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో తమను డామినేట్ చేస్తారనే కాంగ్రెస్ నేతల్లో అనుమానం ఉంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేరేగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడ్ని బలోపేతం చేయాలన్న దిశగా ఆలోచించదు. పార్టీ పరంగా…అధికారంలోకి తెచ్చుకోవడం లేదా.. పార్లమెంట్ సీట్లలో అత్యధికం సాధించుకోవడం లాంటి ఎత్తుగడలు వేసుకుంటుంది. అందుకే… కొత్త నాయకులు ఎవరొచ్చినా చేర్చుకుంటూనే ఉంటారు.
రేవంత్‌ను పరిమితం చేసే ప్రయత్నాలు జరిగాయా..?
చేరేది ఢిల్లీలో అయినా.. పని చేయాల్సింది మాత్రం తెలంగాణలోనే. రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే ప్రచారం జరిగింది. తరవాత ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉంటారని చెప్పారు. పాదయాత్ర చేస్తారని కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతల వల్ల…ఆ నేతల మధ్య ఉండే పోటీ వల్ల ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఆయన ఏ పోరాటం చేసినా… ఆయనకు వ్యక్తిగతంగానే లాభం వస్తుందన్న అంచనాతో… తాము నష్టపోతామని కాంగ్రెస్ పెద్దల్లో రావడంతో.. ఏదీ కార్యాచరణలోకి రాలేదు. ఇటీవలి కాలంలో.. చాలా పదవులు భర్తీ చేశారు.. కానీ రేవంత్ కు కానీ.. ఆయనతో పార్టీలోకి వచ్చిన వారికీ కూడా .. కాంగ్రెస్ లో ఎలాంటి పదవులు రాలేదు. అంటే.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లో పరిమితం చేసే ప్రయత్నం చేశారు.
సరైన సమయంలో అధిష్టానం పదవులు ఇస్తుంది..!
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చెబుతున్నదేమిటంటే.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఎదురీత ఉండొచ్చు.. కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం .. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కొన్ని నిర్దిష్టమైన అంచనాలతోనే పార్టీలో చేర్చుకున్నారు. ఆయన వర్గానికి టిక్కెట్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అందుకే సరైన సమయం చూసుకుని… హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు. అందుకనే.. కాంగ్రెస్ పార్టీలోకొన్ని అంతర్గత నియామకాలు ఆగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏమింటే..నలుగురు పార్టీని బాగుపరచాలనుకుంటే.. ఎనిమిది మంది చెడగొట్టే ప్రయత్నంలో ఉంటారు. నేను ఎదగకపోయినా పర్వాలేదు… వేరే వాళ్లు ఎదగకూడదన్న మెంటాలిటీని… వదిలేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బాగుపడదు.
ముందు గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు పోరాడాలి..!
పదవుల కోసం.. ఇప్పుడే కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే.. పదవులు వస్తాయి. అలా కాకుండా.. తమ కొట్లాటల వల్ల అసలు పార్టీనే అధికారంలోకి రాకుండా చేసుకుంటే ఏమి వస్తుంది. అందుకే ఎవరికి ప్రజాబలం ఉందో..వారినే ముందు పెట్టుకుని పోరాడితే.. గెలుపు దక్కుతుంది. అప్పుడు పదవుల పంచాయతీ తేల్చుకోవచ్చు.