ఉమ్మడి హైకోర్టును రెండు హైకోర్టులుగా విభజిస్తే.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే.. మొత్తం ఏపీ హైకోర్టు.. అక్కడికి తరలి పోవడానికి ఐదు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గెజిట్ నోటిఫికేషన్ వస్తే.. జనవరి ఒకటో తేదీన రెండు రాష్ట్రాల్లోనూ.. కొత్త హైకోర్టులు ప్రారంభం కావాలని గెజిట్లో పేర్కొన్నారు. దీనిపై.. ఉమ్మడి హైకోర్టులో పని చేస్తున్న ఏపీ న్యాయవాదులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కనీసం నెల రోజులైనా సమయం ఇవ్వకుండా.. ఈ హడావుడి విభజన ఏమిటని.. ప్రశ్నిస్తున్నారు. విభజన వద్దని ఎవరూ అనడం లేదని.. కానీ.. ఇలా ఉన్న పళంగా వెళ్లమనడం ఏమిటనేది వారి అభ్యంతరం. అందుకే ఏపీ బార్ కౌన్సిల్ హైకోర్టు విభజన ఆపాలంటూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతిలో కోర్టు భవనం పూర్తయ్యే వరకు.. విభజన వాయిదా వేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై విచారణ జరపాలా? లేదా అనేది చీఫ్ జస్టిస్ ఇంకా తేల్చలేదు. సోమవారం విచారణకు వస్తుందని ఏపీ బార్ కౌన్సిల్ భావిస్తోంది.
అదే సమయంలో.. సాంకేతికంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ ముగిసింది. హైకోర్టు విభజన నేపథ్యంలో న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులు బదిలీలు జరిగాయి. దాదాపు 100 మందికి పైగా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులను ఆ రాష్ట్రానికే బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల విభజన ప్రక్రియ సంపూర్ణమయింది.
మరో వైపు.. హైకోర్టు విభజన వ్యవహారంపై రాజకీయరగడ జరిగింది. ఎప్పుడైనా హైకోర్టును విభజిస్తే.. అన్నీ తరలించడానికి.. న్యాయవాదుల సౌకర్యం కోసం అయినా.. ఓ నెల రోజుల సమయం ఇవ్వడం సంప్రదాయమంటున్నారు. అలా ఉన్న పళంగా పంపేయడంతో… ఇబ్బందులొస్తాయని… ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే దీనిపై.. కేసీఆర్ కూడా విమర్శలు గుప్పించారు. అందుకే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. ఒకటో తేదీన రెండు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు కాబట్టి.. సుప్రీంకోర్టు నిర్ణయం కీలకం కానుంది.