కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యాంగ్రీ యంగ్ మ్యాన్ బ్రాండ్ ఇమేజి కోసం ప్రయత్నిస్తున్నారేమో. ఎక్కడ వివాదం తలెత్తితే అక్కడ వాలిపోతున్నారు. అవసరమైత లక్షలు ఖర్చు పెట్టి చార్టర్డ్ ప్లేన్ ఆగమేఘాల మీద ప్రయాణం కడుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అందరికన్నా ముందు వాలిపోయిన రాజకీయ నాయకుడు ఆయనే. ఆ తర్వాత అనేక మంది నాయకులు క్యూ కట్టారు. శవాల మీద ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.
ఇప్పుడు ఢిల్లీలో మరో వివాదం రాజుకోగానే రాహుల్ గాంధీ అటెండెన్స్ పడిపోయింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నరహంతక ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా ప్రదర్శన జరగడం వివాదానికి దారితీసింది. ఆనాటి ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా, కాశ్మీరీ ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేశారనే అభియోగాలున్నాయి. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హోం మంత్రి ఆదేశించారు. దీంతో విద్యార్థి సంఘం అధ్యక్షుడిని అరెస్టు చేశారు. కొందరు విద్యార్థులను యూనివర్సిటీ తాత్కాలికంగా డిబార్ చేసింది. దీనిపై అఫ్జల్ గురు అనుకూల విద్యార్థి సంఘాల వారు మండిపడ్డారు. వివాదం ముదురుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు.
జేఎన్ యూ లో ఆయన ప్రవేశానికి నిరసనగా ఏబీవీపీ విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. అయినా రాహుల్ గాంధీ క్యాంపస్ లోకి వెళ్లారు. అఫ్జల్ గురు అనుకూల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టిన చోట ప్రసంగించారు. మీ గొంతును నొక్కుతున్న వారే నిజమైన దేశద్రోహులను వ్యాఖ్యానించారు. అంటే ఏమిటి? పార్లమెంటుపై దాడికి ప్లాన్ చేసి, అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడానికి కారకుడైన అఫ్జల్ గురును ఉరితీయాలనేది కోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పును తీహార్ జైలు అధికారులు అమలు చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉంది. అలాంటి అఫ్జల్ గురు హీరో అని కీర్తిస్తూ నినాదాలు చేసిన వారిపై చర్య తీసుకోవడం దేశద్రోహమా? కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతలు క్షీణించకుండా, దేశంలో జాతి వ్యతిరేక ధోరణి ప్రబలకుండా కఠినంగా వ్యవహరించడం దేశ ద్రోహమా? ఇంతకీ రాహుల్ గాంధీ అఫ్జల్ గురును హీరోగా భావిస్తున్నారా? నరహంతకుడిగా భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పాల్సి ఉంది.