ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశంలో చర్చకు దారితీస్తోంది. గన్ మెన్ ను కూడా ఆమె వెనక్కి పంపించేసి, జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారు. భద్రత కల్పిస్తామని పోలీసులు వస్తున్నా… ఆమె నిరాకరిస్తున్న పరిస్థితి ఉందని సమాచారం. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు కూడా అఖిలప్రియ దూరంగా ఉండటం విశేషం. ఇలా నిరసన వ్యక్తం చేయడం ద్వారా పార్టీ అధిష్టానానికి అఖిలప్రియ ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు అనేదానిపై ఇప్పుడు టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కార్డన్ సెర్చ్ వ్యవహారం జరిగి వారం దాటిపోతున్నా కూడా ఆమె ఎందుకు మౌనాన్ని వీడటం లేదన్నదే ప్రశ్న..?
ఆళ్లగడ్డలో ఇటీవల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అనుచరుల ఇళ్లలోకి అర్ధరాత్రిపూట పోలీసుల చొరబడి, తనిఖీలు చేశారు. ఈ క్రమంలో తన అనుచరుల ఇళ్లపై దాడులు చేయడాన్ని అఖిలప్రియ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఈ కార్డన్ సెర్చ్ మీద స్థానిక పోలీసులను అఖిలప్రియ ప్రశ్నిస్తే… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశామని చెప్పారట. ఆ తరువాత, అధికారులతో బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వ్యవహారం సద్దుమణగలేదని తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఆవిడకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనీ, సమస్యలు వస్తే పెద్దలతో చెప్పి పరిష్కారం చేసుకోవాలనీ, విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందనీ, ఆయన పరిష్కరిస్తారనీ, పోలీసులు వారి డ్యూటీ వారు చేశారని చినరాజప్ప అన్నారు.
టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మరో చర్చ ఏంటంటే… అఖిలప్రియ అలకకు అసలు కారణం కార్డన్ సెర్చ్ కాదనీ, పార్టీలో కొన్ని పరిణామాల పట్ల ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నారని! అఖిలప్రియ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందా జిల్లా సీనియర్ నేత కేయీ కృష్ణమూర్తిని కోరితే… ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి దృష్టికి వ్యవహారం వెళ్లిందని హోం మంత్రి అంటున్నా… ప్రభుత్వం దీన్ని పెద్దగా సీనియర్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. పట్టువిడుపు ధోరణితో అఖిలప్రియ వ్యవహరించాలనీ, పంతానికి పోవడం సరికాదనే సంకేతాలు పార్టీ నుంచి వస్తున్నాయట. ఈ నేపథ్యంలో అఖిలప్రియ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడితో దీన్ని వదిలేస్తారా, లేదంటే పార్టీ మార్పు వరకూ ఆలోచించే స్థాయికి ఈ వివాదాన్ని తీసుకెళ్తారా అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చగా తెలుస్తోంది.