తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలపై అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి వున్నారు. అంతేగాక రాష్ట్రాల వారిగా పరిస్థితులు విభిన్నంగా వుంటాయి గనక ఎక్కడికక్కడ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభలకే ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ వైఖరికి మద్దతు తెల్పుతూ తమిళనాడు డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంటు స్టాలిన్ లేఖ రాశారు. దీనికి కెసిఆర్ ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. బాగానే వుంది గాని ఇక్కడో చిన్న రాజకీయ సందేహం వుత్పన్నమవుతున్నది. ప్రధాని మోడీ నవంబరు 28న హైదరాబాద్ వస్తున్నారు. కొన్ని గంటల పాటు వుంటున్నారు. ఆ సమయంలో పై రెండు అంశాలపై వేరు వేరుగా అఖిలపక్ష ప్రతినిధివర్గాలతో మెమోరాండాలు ఇవ్వాలని రాష్ట్రం కోరితే ఆమోదం లభించలేదట. కాని బిజెపి కార్యకర్తలతో మాత్రం ప్రధాని పదిహేను నిముషాలు మాట్లాడబోతున్నారు. రాష్ట్రాధినేతకే సమయం ఇవ్వని ఈ వైఖరిపై టిఆర్ఎస్ నాయకులెవరూ పల్లెత్తు మాట అనకపోవడం విచిత్రం. రాజకీయంగా బిజెపిని కేంద్రాన్ని నొప్పించకూడదనే మెతకదనం అతి జాగ్రత్త ఒకవైపు ప్రదర్శిస్తూ మరోవైపు ఢిల్లీలో ధర్నాలు నిరసనల వల్ల ఉపయోగమేమిటనే ప్రశ్న ఎదురవుతున్నది.