మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానని.. బండి సంజయ్ భీకరమైన ప్రకటన చేశారు. అయితే నేరుగా కాదు.మీడియాతో చిట్ చాట్ లోనే. దారుస్సలాం.. ఎంఐఎం పార్టీ ఆఫీసు కార్యాలయం. ప్రైవేటు ఆస్తి అయిన ఈ దారుస్సలాంను బీజేపీ గెలిచినా ఎలా స్వాధీనం చేసుకుంటారో కానీ.. ఆయన మాత్రం..అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడతారన్న విమర్శలకు మరోసారి కారణం అయ్యే పరిస్థితి వచ్చింది.
రేవంత్ రెడ్డిలాగా పార్టీ నడపలేకపోతున్నారని తనపై వస్తున్న విమర్శలకు కూడా విచిత్రంగా కౌంటర్ ఇచ్చుకున్నారు బండి సంజయ్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాగా ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం, పార్టీలు మారడం తనకు చేతకాదని బీపేజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీని ఎలా నడుపుతున్నారు. అదే పార్టీకి చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని అన్నారు.హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపడం రాకపోతే ఎలా గెలుస్తామంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
తాము గెలుపు పరంపరను కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఓటమి పరంపను కొనసాగిస్తుందని అన్నారు. తమ దగ్గర సీనియర్లే బాస్ లు అని.. అదే హస్తం పార్టీలో సీనియర్లు హోంగార్డులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్యాండిడేట్లు దొరకట్లేదంటూ ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ఎక్కడ ఉందో సీఎం కేసీఆర్ ను, ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్ ను అడగాలన్నారు. తమది కుటుంబ పార్టీ కాదని.. తండ్రి పేరు చెప్పుకొని కుమారుడు, కూతుర్లు సీఎంలు కాలేరంటూ వాదించారు.
మొత్తానికి బండి సంజయ్ .. ఇటీవల కాలంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అసహనానికి గురవుతున్నారు. కాంగ్రెస్ లో చేరికలు పెరిగే సూచనలు కనిపిస్తూండటం.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయేలా ఉండటంతో ఆ అసహనం సంజయ్ లో కనిపిస్తోందని అంటున్నారు.