ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నాలుగున్నరేళ్లయింది. ఉమ్మడిగా ఉన్న హైకోర్టును.. నాలుగున్నరేళ్లకు ఎట్టకేలకు విభజించారు. విభజన సంపూర్ణం అయిందనే భావన రెండు రాష్ట్రాల్లోనూ వ్యక్తమయింది. కానీ ఇప్పటికీ విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉమ్మడి సంస్థల విభజన మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఆస్తి, అప్పుల పంపిణీ నలుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి, వాటి పంపకాల కోసం కేంద్రం షీలా భిడే కమిటీని నియమించింది. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటి పంపకానికి ఏ కమిటీ లేదు. ప్రభుత్వాలే పంచుకోవాలని చట్టంలో పెట్టారు. అక్కడే పీట ముడి పడింది.
షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థలకు గాను 78 సంస్థలకు సంబంధించిన పంపకాలను పూర్తి చేసింది. మరో 13 సంస్థలను ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేయాల్సి ఉంది. నిజానికి విభజన చేసిన 78 సంస్థలకు ఎలాంటి ఆస్తులు, అప్పులు లేవు కాబట్టి విభజన సాఫీగా సాగిపోయింది. కానీ.. టూరిజం, జెన్ కో, ట్రాన్స్ కో లాంటి అత్యంత కీలకమైన 13 సంస్థల విభజన మాత్రం… ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ఇవన్నీ విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆస్తుల అప్పుల విభజన మాత్రం సాగడం లేదు. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలున్నాయి. వాటిలో 57 ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 15 యూనివర్సిటీలు, 21 చట్టబద్ధ సంస్థలు, 45 సొసైటీలు, మరో నాలుగు ఇతర సంస్థలు ఉన్నాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఒప్పందంతో వాటిని పంచుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ప్రభుత్వాల మధ్య పంచాయతీ ఏర్పడితే కేంద్రం జోక్యం చేసుకోవాలి.
తెలుగు అకాడమీ, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఏపి ఫారెస్ట్ అకాడమీ, ఏపి పోలీస్ అకాడమీ వంటి సంస్థలున్నాయి. ఆ సంస్థలకు సంబంధించి భూమి, భవనాల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అధికారులు చెబుతున్నారు. ఉన్నత విద్యామండలి విషయంలో జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని తీర్పు చెప్పింది. కానీ ఈ ప్రకారం విభజించడానికి కూడా ముందుకు రాలేదు. కోర్టు తీర్పు కూడా.. ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. గవర్నర్ ప్రత్యేకంగా.. రెండు రాష్ట్రాల కమిటీల మధ్య చర్చలు జరిపించారు కానీ ఆయన ఏకపక్షంగా.. తెలంగాణ వైపు వ్యవహరిస్తూండటంతో… ఏపీ పట్టించుకోవడం మానేసింది. కేంద్రమూ అదే దారిలో ఉంది.