విజయవాడతో పాటు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వరద స్థానిక ప్రజలను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయిన ప్రజలంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కోవటంతో ఆస్తినష్టం కాస్త ఎక్కువగానే ఉంది. అయితే, మీకు మేమున్నాం, ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున స్వయంగా సీఎం హామీ ఇచ్చి వచ్చారు.
సూర్యాపేట, ఖమ్మం, మహబూబా బాద్ ప్రాంతాల్లో వరద నష్టంపై అధికారుల రిపోర్ట్ ఇచ్చారు. దాని ఆధారంగానే ప్రభుత్వం… కేంద్రం నుండి వచ్చిన వరద నష్టం అంచనా కమిటీకి రిపోర్ట్ ఇవ్వటంతో పాటు సాయం చేయాలని కోరింది.
ఇటు ఏపీలోనూ కేంద్ర కమిటీ రావటం, అంచనాలు వేయటం జరిగాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం కుటుంబానికి 25వేల సహయం చొప్పున ప్రకటించింది. ఎక్కువ నష్టం జరిగిన వారికి కాస్త ఎక్కువ పరిహారం, తక్కువ నష్టం జరిగిన వారికి తక్కువగా కొంత ఊరటనిచ్చేలా పరిహారం ప్రకటించింది.
కానీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా అధికారుల మదింపు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. వరద సమయంలోనూ ముగ్గురు మంత్రులున్నా చివరి సమయం వరకు పట్టించుకోలేదన్న అసంతృప్తి వ్యక్తం అయింది. కానీ, వరద సహయం విషయంలో అయినా సర్కార్ ఉదారంగా, వీలైనంత త్వరగా ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.