‘కల్కి’కి సంబంధించిన ప్రమోషన్లు లైట్‌గానే జరిగాయి. ఓరకంగా హాలీవుడ్ స్టైల్ అనుసరించారు. తమకేం కావాలో.. అదే చేశారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పాలనుకొన్నారో అంతే చెప్పారు. హాలీవుడ్ వాళ్లు సినిమాలోని ఏదో ఓపాత్రని, లేదంటే ఆబ్జెక్ట్ ని విరివిగా ప్రమోట్ చేస్తారు. ‘కల్కి’ అదే ఫాలో అయ్యింది. బుజ్జిని దేశమంతా తిప్పి, అటెన్షన్ తీసుకొచ్చింది. అమితాబ్, కమల్, ప్రభాస్‌లతో గ్రూప్ ఇంటర్వ్యూ చేసి, ఆ ఫుటేజీ బయటకు వదిలింది. కల్కి వరల్డ్ ని నాగ్ అశ్విన్ తో విపులంగా వివరించారు. అంతే.. ఇంతకు మించిన ప్రమోషన్స్ లేవు. ఆంధ్రాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించాలనుకొన్నారు. కానీ కుదర్లేదు.
ఇప్పుడు సక్సెస్ మీట్ వంతు వచ్చింది. కల్కి సాధించిన భారీ విజయాన్ని తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. వైజయంతీ మూవీస్‌కు కూడా ఆ ఆలోచన ఉంది. ముంబైలోనో, లేదంటే అమరావతిలోనో ఈవెంట్ నిర్వహించాలన్నది ప్లాన్. ముంబైలో అయితే కమల్, అమితాబ్, దీపికా లాంటి వాళ్లు అందుబాటులో ఉంటారు. ఆంధ్రాలో అయితే వాళ్లెవరూ లేకుండానే ఈవెంట్ చేయాలి.
అయితే… ‘కల్కి’ లాంటి సినిమాలు వచ్చిప్పుడు ఇండస్ట్రీ అంతా ఏకమై సెలబ్రేట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ పెద్దలే ‘కల్కి’ కోసం ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ‘కల్కి’లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. తెలుగు సినిమా గొప్పదనాన్ని, ముఖ్యంగా మన పురాణాల విశిష్టతనూ చాటి చెప్పిన సినిమా ఇది. దేశ వ్యాప్తంగా వసూళ్లతో హోరెత్తుతోంది. థియేటర్లకు ఇక కష్టకాలం వచ్చిందనో, మూసి వేసుకోవడం తప్పదనో భయపడుతున్నప్పుడు వచ్చిన సినిమా ఇది. మళ్లీ థియేటర్లకు కొత్త కళ తీసుకొచ్చిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను.. సినిమా పరిశ్రమ మొత్తం సెలబ్రేట్ చేస్తే.. అది సినిమాకు ఇచ్చిన గౌరవంగా మిగిలిపోతుంది.