తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఓ సింగిల్ లైన్ డైలాగ్ తో మెరుపు మెరిపించిన కేసీఆర్ మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ విస్తృత ప్రచారం జరుగుతోన్నా ఖండించలేదు. ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలను లేవనెత్తి, ప్రజలకు చేరువ కావాల్సిన కేసీఆర్ ప్రజలకు కాదు కదా, కనీసం పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి, మీడియా ముందుకు రావడం లేదు అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి. బీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నా, ఈ విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌజ్ ను వీడి బయటకు రావడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే ఆయన సైలెంట్ గా ఉన్నారా అంటే అది లేదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై , వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ గడువు ముగిసినా నెరవేర్చలేదు.. ఇక చీల్చి చెండాడుతానన్న కేసీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కొత్త జోష్ నింపాయి.
కేసీఆర్ ఏదో మ్యాజిక్ చేస్తారని, అసెంబ్లీలో పంచ్ డైలాగ్ లతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారని అనుకుంటే.. అసెంబ్లీకి ఒకరోజే హాజరై ముక్కున వేలేసుకునే చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయం చేసేందుకు స్కోప్ ఉన్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్ లోనే ఉంటున్నారు.
దీంతో కేసీఆర్ ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి మళ్లీ ఎప్పుడు వస్తారని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆయన రాకపై పార్టీ పెద్దలు ఎవరూ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికీ తెలియదు కాబట్టి !