మా రాజీనామాలు ఆమోదించాల్సిందేనని ముగ్గురు ఎమ్మెల్సీలు శాసనసభలో ప్లకార్డులు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. చైర్మన్ గారూ మేము స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు ఇచ్చాం .. ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని అడిగితే ఆయన వద్ద సమాధానం లేదు. చర్యలు తీసుకుంటామని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇందుకూరి రఘురాజు అనే ఎమ్మెల్సీ విషయంలో అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకపోయినా రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేశారు. హైకోర్టులో ఇబ్బంది పడ్డారు. అవసరం లేని అనర్హతా వేటు వేసి.. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల గురించి మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నాయి. కానీ స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. వారి ముగ్గుర్ని బతిమిలాడి అయినా పార్టీలోనే ఉంచుకుందామని ప్రయత్నిస్తున్నారు. వారు రాజీనామా చేసినప్పటి నుండి అనేక సార్లు రాయబారాలు నడిపారు. టీడీపీలో కూటమి పార్టీల్లో ప్రాధాన్యం ఉండదని వైసీపీలోనే ఉండాలని కోరారు. కానీ ఆ ముగ్గురూ నిరాకరించారు. పదవులు పోయినా పర్వాలేదు వైసీపీలో మాత్రం ఉండలేమన్నారు.
ఇంత ఛీ కొడుతున్నా వారి రాజీనామాలు ఆమోదించడానికి వైసీపీకి చెందిన చైర్మన్ మోషేన్ రాజు మొహమాట పడుతున్నారు. ఆయన పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి మండలిలో వైసీపీకి బలం ఉంది. అందుకే ఎమ్మెల్సీలు సభకు వస్తున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఇంకెంత మంది ఆ పని చేస్తారోనని వైసీపీ కంగారు పడుతోంది. ఎందుకంటే రాజీనామాలు చేస్తే ఒక్క పదవి కూడా తిరిగి వైసీపీకి రాదు.