తెలుగు సినిమా రచయితల్లో పూళ్లపూడి వెంకటరమణ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్నారు. ఆయన శైలి, అక్షరాల్లో చూపించే సొగసు, వ్యంగ్యం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని మధురానుభూతులు. స్వతహాగా సరస్వతీపుత్రులకు ముక్కు మీద కోపం ఉంటుంది అంటుంటారు. వాళ్లు చటుక్కున సీరియస్ అయిపోతారు. ముళ్లపూడి వారికీ ఆ గుణం కొద్దో గొప్పో ఉంది. ఓ సినిమా షూటింగ్ లో అది బయటపడింది.
‘గుడి గంటలు’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. నందమూరి తారక రామారావు కథానాయకుడు. ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచయిత. పాత్ర ప్రకారం.. ఈ సినిమాలో హీరో చైన్ స్మోకర్. ఎప్పుడూ హీరో చేతిలో సిగరెట్ వెలుగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్‌కు సిగరెట్ తాగే అలవాటు లేదు. కానీ ఈ సినిమా కోసం చేసుకొన్నారు. ఎన్టీఆర్ సెట్లో అడుగు పెట్టగానే ఓ కొత్త సిగరెట్ డబ్బా ఆయన టేబుల్ మీద ఉండాల్సిందే. సినిమా కోసమే అయినా, షూటింగ్ లో ఎన్ని సిరగెట్లు కాల్చాలి? అనేది కూడా ఎన్టీఆర్ కు లెక్కే. సెట్లో చాలామందికి సిగరెట్ అలవాటు ఉంది. కానీ వాళ్లెప్పుడూ ఎన్టీఆర్ కోసం అట్టిపెట్టిన డబ్బా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అయితే ఓ రోజు ముళ్లపూడి సెట్ కి వచ్చారు. ఆయనా స్మోకరే. ఎన్టీఆర్ కోసం అట్టిపెట్టిన సిరగెట్ డబ్బా కనిపించేసరికి ముళ్లపూడికి మనసులాగింది. ‘సార్.. అది ఎన్టీఆర్ గార్ డబ్బా. ముట్టుకొంటే ఆయనకు కోపం వస్తుంది’ అని ఎవరో వారించారు కూడా. ఎన్టీఆర్‌కూ, ముళ్లపూడి వారికి మంచి స్నేహం, చనువూ ఉంది. ‘ఆయనకు మనమేంటో తెలుసు కదా. రచయితగా గౌరవం కూడా. మనల్ని ఏం అనరులే’ అనే ధైర్యంతో వెంటనే డబ్బా ఓపెన్ చేసి ఓ సిగరెట్ ఊదిపాడేశారు. ఆ తరవాత మరోటి.. ఇలా మూడు నాలుగు సిగరెట్లు అవ్వగొట్టారు.
ఆ తరవాత కొంతసేపటికి ఎన్టీఆర్ సెట్ కి వచ్చారు. దర్శకుడు షాట్ రెడీ అన్నారు. ఎన్టీఆర్ సిగరెట్ డబ్బా కోసం వెదికారు. అయితే అది అప్పటికే ఓపెన్ చేసి ఉంది. అంతే కాదు.. కొన్ని సిగరెట్లు గల్లంతయ్యాయి. ఎన్టీఆర్ కు వెంటనే కోపం నషాళానికి అంటింది. ‘ఈ పని చేసిందెవరు’ అని సెట్లోనే అరిచేశారు. ముళ్లపూడి వారు కూడా పక్కనే ఉన్నారు. ఆయనే సిగరెట్లు కాల్చారన్న సంగతీ అర్థమైంది. అయినా ఎన్టీఆర్ కోపం తగ్గలేదు. ‘నా కోసం పెట్టిన సిగరెట్లు ముట్టుకోకూడదని తెలిదా. ఇది నిర్మాత సొమ్ము. దానికి వాల్యూ ఇవ్వండి. వాళ్ల కష్టాన్ని గుర్తించండి. మీరూ నిర్మాత అయితే గానీ ఆ బాధ తెలీదేమో’ అంటూ హైపిచ్‌లో గొంతు లేపారు. దాంతో సెట్లో అందరి ముందూ ముళ్లపూడి వారి పరువు పోయినట్టైంది. ఆయన మొహం చిన్నబుచ్చుకొని పక్కకు వెళ్లిపోయారు.
ఆ తరవాత సదరు నిర్మాత ముళ్లపూడి వారి దగ్గరకు వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముళ్లపూడి శాంతించలేదు. ”నిర్మాత సొమ్ముకు నేనూ విలువ ఇస్తా. ఏమో ఎవరు చెప్పగలరు. రేపో.. మాపో నేనే నిర్మాత కావొచ్చు. నా చేతుల మీదుగా పారితోషికాలూ ఇస్తానేమో. ఎన్టీఆర్ ఉన్నా సరే, ఏఎన్నార్‌తో సినిమాలు తీస్తానేమో” అంటూ నర్మగర్భంగా ఛాలెంజ్ ఒకటి విసిరారు. పైన తథాస్తు దేవతలు ఇదంతా విన్నారేమో.. వాళ్లు ఆశీర్వదించారు. కొన్నాళ్లకు నిజంగానే ముళ్లపూడి నిర్మాతయ్యారు. విచిత్రంగా ఆయన ఏఎన్నార్ తో సినిమాలు తీశారు. అలాగని… ఎన్టీఆర్‌తో సంబంధాలేమీ తెగిపోలేదు. ఆ తరవాత కూడా ఎన్టీఆర్ చిత్రాలకు ముళ్లపూడి పని చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరవాత బాపు, రమణలను తగు రీతిలో గౌరవించారు. ”ఆరోజు నేను ఆ మాటలు అలా ఎలా అన్నానో నాకే తెలీదు. విధి నన్ను విచిత్రంగా నిర్మాతనూ చేసేసింది. తథాస్తు దేవతలు ఉంటారన్న నమ్మకం నా విషయంలో నిజమైంది” అంటూ ముళ్లపూడి తన ఆత్మకథలో రాసుకొన్నారు.