కొన్ని సినిమాలకేదో అవుతుంది. సినిమా పూర్తయినా విడుదల కావు. ఇదిగో అదుగో అంటుంటారు… కానీ బయటకు రావు. శంకర విషయంలో ఇదే జరుగుతోంది. తమిళంలో మంచి విజయం అందుకొన్న మౌనగురు సినిమాని తెలుగులో నారా రోహిత్‌తో రీమేక్ చేశారు. రెజీనా కథానాయికగా నటించింది. సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండేళ్ల క్రితం ఎప్పుడో పూర్తయ్యింది. ఈలోగా నారా రోహిత్ నటించిన నాలుగైదు సినిమాలు మొదలై.. విడుదలై వెళ్లిపోయాయి. వాటి గురించి ప్రేక్షకులూ మర్చిపోయారు. అయితే శంకర మాత్రం రాలేదు. మధ్యలో చాలాసార్లు విడుదల తేదీ ప్రకటించారు.. కానీ వెంటనే వాయిదా వేశారు. ఇలా కనీసం అరడజనుసార్లు జరిగి ఉంటుంది. దాంతో శంకర సినిమాని జనంతో పాటు నారా రోహిత్ కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ మళ్లీ నిర్మాతల నుంచి ప్రకటన వచ్చింది. వచ్చే నెల 16న ఈ సినిమాని విడుదల చేస్తారట. అంటే ఏకంగా నెల రోజుల ముందే విడుదల తేదీ ఫిక్స్ చేశారన్నమాట. ఈలోగా.. ఇది ఎన్నిసార్లు వాయిదా పడుతుందో?
శంకర సినిమాని అసలు సిసలు సమస్య ఫైనాన్స్ ప్రాబ్లం. లాబు ఫీజు, ఇతరత్రా బాకాయిలు కలిసి రూ.1.5 కోట్ల వరకూ కట్టాలి. ఈ సినిమాని బిజినెస్ జరిగితే అవి తీర్చి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకొని, అప్పుడు రిలీజ్ చేద్దామన్నది నిర్మాతల ప్లాన్. కానీ.. ఈ సినిమాని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దాంతో రిలీజ్ డేట్ ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం ఓ ప్రహసనంగా మారింది. ఇప్పుడు ఈ సినిమాని మళ్లీ బయటకు తీశారు. దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే… మౌనగురు సినిమాని హిందీలో మురగదాస్ రీమేక్ చేశారు. అకీరా పేరుతో విడుదల అవుతోంది. ఆ సినిమాపై కావల్సినంత బజ్ ఉంది. అకీరా కథ మా కథ ఒకటే అని చెప్పుకొంటే కనీసం బయ్యర్లు ఇంట్రస్ట్ చూపిస్తారు కదా. అదీ.. నిర్మాతల ప్లాన్. అయితే నారా రోహిత్ సినిమాలు వరుసగా బాక్సాఫీసు దగ్గర బోల్తా కడుతున్నాయి. అకీరా పోస్టరు చూసి ఈ సినిమాని కొనడానికి ముందుకు వస్తారనుకోవడం అత్యాసే. సో… ఈసారైనా శంకరకు మోక్షం దక్కుతుందా అనేది అనుమానంగా మారింది.