పవన్ కోపం, ఆవేశం.. అభిమానులకు తెలియనివి కావు. కానీ.. అవన్నీ వ్యవస్థపై, అందులోని లోపాలపై. ఇది ఇప్పుడు పుట్టుకొచ్చిన లక్షణాలు కావు. ముందు నుంచీ ఉన్నవే. పవన్ లోని ఆవేశం, కోపం ఏపాటివో.. చెప్పే ఫ్లాష్ బాక్ ఇది. దాని గురించి తెలుసుకోవాలంటే – `రుద్రవీణ` రోజుల్లోకి వెళ్లాలి.
రుద్రవీణ షూటింగ్ మొత్తం అయిపోయింది. ఊటీ నుంచి.. పేకప్ చెప్పేసి చిత్రబృందం చెన్నై తిరుగు ప్రయాణమైంది. చిరంజీవి, నాగబాబు ఓ కార్లో వస్తున్నారు. వెనుక మరో వాహనంలో సెట్ ప్రాపర్టీతో మరి కొంతమంది బృందంగా వస్తున్నారు. సడన్‌గా సిబ్బంది ఉన్న వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్లందరినీ చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఈ చిత్రానికి నిర్మాత నాగబాబు. అంటే చిరంజీవి సొంత సినిమా కింద లెక్క. సిబ్బంది బాబోగులు చూసుకోవాల్సింది ఆయనే. కాబట్టి.. ఆసుపత్రికి చిరంజీవి, నాగబాబు కలిసి వెళ్లారు. `వీళ్లంతా మా వాళ్లే.. మరింత జాగ్రత్తతో వైద్యం చేయాలి` అని డాక్టర్లని రిక్వెస్ట్ చేసుకుంటే..అక్కడున్న డ్యూటీ డాక్టర్లు ఇవేం పట్టించుకోకుండా – రివర్స్‌లో మాట్లాడడం మొదలెట్టార్ట. సిబ్బంది గాయాలతో అల్లాడుతున్నా – ఎవరూ పట్టించుకోలేదట. అసహనంతో చిరు, నాగబాబు ఇంటికొచ్చారు. డాక్టర్ల నిర్వాకం ఇంట్లో వాళ్లకు చెప్తుంటే.. ఇవన్నీ అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ చెవిలో పడ్డాయి.
వెంటనే.. పవన్ అక్కడి నుంచి బయల్దేరాడు. ఇంట్లో కార్లున్నా – ఆవేశంగా ఆసుపత్రి వరకూ నడచుకుంటూ వెళ్లిపోయాడు. `వాళ్లెవరనుకుంటున్నారు. మా అన్నయ్యల్లు. వాళ్ల దగ్గర అమర్యాదగా మాట్లాడతారా? గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వాళ్లకు చికిత్స చేయడం మీ ధర్మం కాదా.. వాళ్లకేమైనా జరిగితే – అప్పుడు చెప్తా మీ సంగతి` అంటూ డాక్టర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాడట. ”పవన్ లో అంత ఆవేశం ఉందని నాకు అప్పటి వరకూ తెలీదు. పవన్ అలా వార్నింగ్ ఇచ్చేంత వరకూ డాక్టర్లు వైద్యం మొదలెట్టలేదు. తన ఆవేశం అప్పుడు అలా పనికొచ్చింది. అప్పటి నుంచీ పవన్ అంతే. ఏం మారలేదు. అలానే ఉన్నాడు” అని చిరంజీవి ఓ సందర్భంలో పవన్ గురించి ఇలా గుర్తు చేసుకున్నారు.