తెలుగు సినిమాల్లో పంచ్ డైలాగుల పరంపర కొనసాగుతూనే ఉంది. సాగదీసే మాటలతో అర్ధం వచ్చే డైలాగులను రాయడం పూర్తిగా మానేశారు రచయితలు. నోరు తెరిస్తే పంచ్.. డైలాగ్ రాస్తే పంచ్.. సందర్భం ఏదైనా సరే పంచ్ పడాల్సిందే.. అయితే ఈ పంచ్ లు సినిమాలో సందర్భం వస్తే ఓకే కాని ఈ పంచ్ ల వల్ల బయట మాత్రం కొన్ని గొడవలకు దారి తీస్తున్నాయి. సినిమా పరిశ్రమలో కూడా రాజకీయాల మాదిరి శాశ్వత శత్రువులు ఉండరంటారు.
అయితే ఇద్దరు మధ్య వైరం ఉన్నప్పుడు ఒకరి సినిమాల్లో వేరొకరి మీద పంచ్ లేసుకుంటూ వస్తున్నారు దర్శకులు. ఎదురుగా తిడితే బాగోదని సినిమాలో సందర్భం పొందుపరచి మరి పంచ్ పడేలా చేస్తున్నారు. మరి వీరి పనికిమాలిన పంచ్ లకు సినిమానే దొరికిందా అంటే.. ఏం చేసినా చూడ్డానికి ప్రేక్షకులు ఉన్నారు కదా అనే వారి మొండి ధైర్యం. సినిమా కథ, కథనాల మీద దృష్టి సారించిన రచయితలు, దర్శకులు పంచ్ లంటూ పనికిరాని ప్రాసలని వెతుకుతూ ప్రేక్షకులకు తలనొప్పి ఏర్పడేలా చేస్తున్నారు.
పంచ్ లు పేలితే ఓకే కాని పేలకపోతేనే వినేవాడు విసుగు చెందక తప్పట్లేదు. మరి తెలుగు సినిమాలను పట్టి పీడిస్తున్న ఈ పంచ్ పరంపర ఎప్పుడు పక్క పెడతారో దర్శక నిర్మాతలకే తెలియాలి.