లాక్ డౌన్ వల్ల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లు కొత్తగా ఆలోచించడం మొదలెడుతున్నారు. షూటింగులు లేవు, సినిమాలు లేవు, కొత్త కథలు లేవు.. అని ఓ ఫీలైపోవడం లేదు… తమకు నచ్చిన పనిని, తమకు తోచిన దారిలో చేసుకుంటున్నారు. ఇంటి పట్టునే ఉంటూ.. ప్రేక్షకులకు, అభిమానులకూ వినోదాన్నీ, కాలక్షేపాన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు ‘ఏం మాయ చేశావే’ టీమ్ అదే చేసింది.
ఏం మాయ చేసావె తెలుగు వెర్షన్లో నాగచైతన్య – సమంత జంటగా నటిస్తే, తమిళంలో శింబు, త్రిషలపై తీశారు. రెండు చోట్లా సూపర్ హిట్టే. తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ఎవరి ఇంట్లో వాళ్లుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం అందించారు. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్‌ని మంచి స్పందన వస్తోంది. త్రిష, శింబుని మళ్లీ ఒకే తెరపై చూడడం ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలుగులోనూ అలాంటి షార్ట్ ఫిల్మ్ చేస్తే.. అందులో సమంత, చైతూ నటిస్తే, ఇంకా బాగుంటుంది కదూ. మరి గౌతమ్ మీనన్ ఏం చేస్తాడో చూడాలి.