రానా కథానాయకుడిగా నటించిన చిత్రం `విరాట పర్వం`. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021లో ఈ సినిమా విడుదల కావడం దాదాపుగా అసాధ్యం. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు? నిజంగానే థియేటర్లలోకి వస్తుందా? లేదంటే ఓటీటీకి పరిమితమవుతుందా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.
ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేయమని చిత్రబృందం పదే పదే చెబుతోంది. కానీ నిర్మాత సురేష్ బాబు ని నమ్మడానికి వీల్లేదు. ఆయన నారప్ప, దృశ్యం 2లను ఓటీటీకే ఇచ్చేశారు. థియేటర్లో కంటే, ఓటీటీకి ఇవ్వడంలోనే లాభసాటి బేరం ఉందనుకుంటే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలోనే విడుదల చేస్తారు. కానీ ఇప్పటికైతే… విరాటపర్వం థియేటర్లలోనే వస్తుంది. కానీ ఇప్పుడు కాదు. భీమ్లా నాయక్ విడుదలైన తరవాత.
భీమ్లా నాయక్‌లో రానా ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓరకంగా ఇది మల్టీస్టారరే అయినా, కేవలం పవన్ కల్యాణ్ వల్ల.. ఇది పవన్ సినిమాగా చలామణీ అవుతోంది.కానీ తెరపై రానా పాత్ర కూడా పవర్ ఫుల్ గా నే ఉండబోతోంది. భీమ్లా నాయక్ గనుక భారీ విజయాన్ని సాధిస్తే ఆ ఇంపాక్ట్ విరాట పర్వంపై పడుతుంది. భీమ్లాతో… విరాటపర్వం మరింత లాభపడుతుంది. అందుకే భీమ్లా నాయక్ విడుదలైన తరవాతే విరాటపర్వం పనులు మొదలెట్టాలని సురేష్ బాబు భావిస్తున్నార్ట. ఈ లోగా కళ్లు చెదిరే ఆఫర్ గనుక వస్తే.. ఓటీటీ కోసం అప్పుడు ఆలోచిద్దాం అనే ఫీలింగ్ లోఉన్నారు సురేష్ బాబు. అంటే.. జనవరి 12 తరవాతే.. విరాట పర్వం గురించి ఆలోచించాలన్నమాట.