వంద కోట్లంటే ఒకప్పుడు ‘అమ్మో..’ అనేవారు. ఇప్పుడు ఆ మైలు రాయిని ఎవరైనా ఈజీగా దాటేయొచ్చన్న నమ్మకం కలుగుతోంది. చిన్న హీరోలు, మీడియం బడ్జెట్ సినిమాలు సైతం వంద కోట్లు అవలీలగా కొట్టేస్తున్నాయి. పెద్ద హీరో సినిమా అయితే తొలిరోజే ఆ మార్క్ దాటేస్తోంది. కంటెంట్ ఉంటే కలక్షన్లకు ఎలాంటి ఢోకా లేదు. ఈతరం స్టార్ హీరోల సినిమాలెప్పుడో వంద కోట్ల మైలు రాయిని దాటేసి, వేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోల్లో (చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ) ఈ మైలు రాయిని మొదటిగా అందుకొన్నది మెగాస్టారే. బాలకృష్ణ కూడా వంద కోట్ల హీరో అయిపోయాడు. ఆయన కెరీర్లో అఖండ, వీర సింహారెడ్డి చిత్రాలు ఈ మైలు రాయిని అందుకొన్నాయి. ఇప్పుడు `డాకూ మహారాజ్` కూడా వంద కోట్ల సినిమానే.
నిన్నా మొన్నటి వరకూ వెంకటేష్ సినిమాలు కూడా మిడ్ రేంజ్ వసూళ్లే అందుకొనేవి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ వసూళ్లు చేజిక్కించుకొన్నారు. ఈ సినిమా రూ.200 కోట్లు అందుకొంటుందని నిర్మాత దిల్ రాజు ముందే ప్రకటించేశారు. ఈ క్లబ్ లో బాకీ ఉన్న పేరు నాగార్జున మాత్రమే. సోగ్గాడే చిన్ని నాయన రూ.50 కోట్లు అందుకొంది. ఆ తరవాత ‘బంగార్రాజు’ కాస్త దగ్గరగా వెళ్లింది. ఇవి మినహాయిస్తే వసూళ్ల పరంగా నాగ్ సినిమాలు అద్భుతాలు చేయలేకపోయాయి. ఆయన సినిమా బడ్జెట్లు కూడా మీడియం రేంజ్‌లోనే ఉంటాయి. కాకపోతే వంద కోట్ల వసూళ్లు అందుకొనే ఛాన్స్ నాగ్ చిత్రాలకూ ఉంది. అయితే ఆయన తనకు సూటయ్యే ఫ్యామిలీ డ్రామాల్ని ఎంచుకోవాలి. సోగ్గాడే, బంగార్రాజు రెండూ కుటుంబ కథా చిత్రాలే. వాటిలో కాస్త యాక్షన్ మిక్స్ చేశారు. ‘నా సామిరంగ’లో హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. పండగ వైబ్స్ కనిపిస్తాయి. ఈ జోనర్లో కథలు నాగ్ కి బాగా నప్పుతాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇచ్చిన ధీమాతో నాగ్ లాంటి సీరియర్ హీరోలు ఫ్యామిలీ స్టోరీలు ఎంచుకొంటే అలాంటి ఫీట్ సాధించడం పెద్ద కష్టమేం కాదు.
నాగార్జున కూడా కథల ఎంపిక విషయంలో ఈమధ్య మరీ జాగ్రత్తలు పాటిస్తున్నాడు. చైతూ పెళ్లి, అఖిల్ కెరీర్‌పై ఇన్నాళ్లు దృష్టి పెట్టి బిజీ అయిపోయిన నాగ్.. ఇప్పుడు తన సినిమాల గురించి ఆలోచిస్తాడేమో. `నా సామిరంగ` తరవాత సోలో హీరోగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఆయన చేతిలో `కుబేర` ఉంది. ఇదో మల్టీస్టారర్. దీని తరవాత నాగ్ చేసే సినిమాల విషయంలో ఇంకా ఓ స్పష్టత రావాల్సివుంది. నాగ్ వందో సినిమాకు దగ్గర పడుతున్నాడు. దాన్ని పర్ ఫెక్ట్‌గా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. బహుశా.. వందో సినిమాతో వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడేమో చూడాలి.