ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల్ని ఉదయం ఆరు గంటలకే తెరవాలని నిర్ణయించారు. ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకూ మద్యం అమ్ముతారు. ఆ తర్వాత మూసేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మనుషులెవరూ రోడ్ల మీద కనపడకుండా చూసేంత కఠినంగా కర్ఫ్యూ ఉండాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల్ని కూడా పన్నెండు గంటలకల్లా డిపోలకు చేరుస్తారు. దుకాణాలను కూడా పన్నెండు గంటలకు మూసేస్తారు. మందుల దుకాణాలను మాత్రమే ఎమర్జెన్సీ కేటగిరిలో అనుమతిస్తారు. ఆస్పత్రులు యధావిధిగా పని చేస్తాయి.
అసలు ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించడంతో దుకాణాలు తెరిచి ఉన్నా.. ప్రయోజనం ఉండదు. అందుకే.. ఉదయం పన్నెండు కల్లా మద్యం దుకాణాలను కూడా క్లోజ్ చేస్తారు. అందుకే ఆరు గంటలకే తెరవాలని నిర్ణయించారు. రెగ్యులర్ టైమింగ్ ప్రకారం ఉదయం పదకొండు గంటలకు తెరిచి.. పన్నెండు గంటలకు మూసేయడం సాధ్యం కాదు. ఒక్క గంట సేపు మద్యం దుకాణాలు తెరిస్తే.. పరిమితంగా ఉన్న దుకాణాల కారణంగా పెద్ద ఎత్తున మందుబాబులు దుకాణాల వద్ద గుమికూడతారు.
ఉదయమే ఆరు గంటలకు తెరిస్తే… విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. మద్యం ఆదాయం విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్గా ఉంది. ప్రస్తుతానికి ఆ ఆదాయమే.. ఎక్కువగా ప్రభుత్వాన్ని ఆదుకుంటోంది. అది కూడా తగ్గిపోతే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం మధ్యేమార్గంగా.. ఆరు గంటలకే తెరవడానికి సిద్దమయింది. మందు బాబులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా .. ప్రభు్తవ ఆదాయానికి పట్టింపు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.