అమరావతి ఉద్యమానికి మొదట్లో.. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు చాలా ఉద్ధృతంగా మద్దతు తెలిపాయి. ఓ వైపు పవన్ కల్యాణ్.. మరో వైపు కన్నా లక్ష్మినారాయణ.. రైతుల కోసం.. బడా…బడా స్టేట్మెంట్లు ఇచ్చారు. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు. రెండు పార్టీలు విడివిడిగా ఉన్నప్పుడు.. ఇద్దరూ.. దూకుడుగానే ఉన్నారు. అయితే.. ఏ ముహుర్తాన.. పవన్ కల్యాణ్ .. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ.. అప్పుటి నుంచి ఇద్దరూ సైలెంటయిపోయారు. పొత్తు పెట్టుకున్న మొదట్లో ఉమ్మడిగా పోరాటం చేస్తామని.. సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు.. ఆ ఉమ్మడి పోరాటం ఊసు లేదు.. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలనే చర్చ కూడా లేదు.
రాజధాని రైతుల ఆందోళనలు… ఉద్ధృత స్థాయికి చేరాయి. పోలీసుల నిర్బంధాలు.. లాఠీచార్జుల మధ్య వారి పోరాటం…70 రోజులగా సాగుతోంది. రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు.. సంఘిభావం తెలిపి పోతున్నారు. గట్టిగా అండగా నిలబడుతున్న వారు ఎవరూ లేరు. అయినా రాజధాని రైతులు, రైతు కూలీలు వారు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాటం చేస్తున్నారు. జీవనోపాధిని.. కుటుంబాలను పట్టించుకోకుండా.. మహిళలు, రైతులు.. రోడ్ల మీదనే ఉంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి… కానీ భరోసా ఇస్తున్న వారు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.
కేంద్రం దగ్గర నుంచి హామీ తీసుకున్నానని… ఆ మేరకు పొత్తు పెట్టుకున్నానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మూడు రాజధానులతో తమకు సంబంధం లేదని ఢిల్లీ బీజేపీ చెబుతోంది. తాము అన్నీ చెప్పే చేస్తున్నామని… వైసీపీ చెబుతోంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది. బీజేపీ.. జనసేన పోరాడితే.. రైతులకు ధైర్యంగా ఉంటుంది.ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ తల్చుకుంటే.. అమరావతి ఎక్కడికీ పోదు. ఆ విషయం రైతులకు క్లారిటీ ఉంది. కానీ.. వీరావేశంగా గతంలో ప్రకటనలు చేసిన… బీజేపీ, జనసేన.. ఇప్పుడు మాత్రం.. ఉమ్మడి పోరాటం విషయంలో.. ఉలుకూ..పలుకూ లేకుండా పోయాయి. ఈ సమయంలో.. మద్దతు ప్రకటించకపోతే… మరి ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఉద్యమం చేస్తాయో..?