ఏపీ మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఐదు సంతకాలు చేసేశారు. కానీ మంత్రులకు శాఖలు మాత్రం ఇంకా అధికారికంగా కేటాయించలేదు. చంద్రబాబు ఈ అంశంపై కసరత్తు పూర్తి చేశారు. కానీ ప్రకటన మాత్రం ఆలస్యమవుతోంది. జనసేన పార్టీ, బీజేపీకి చంద్రబాబు గౌరవంలో ఏ మాత్రం లోటు రానీయడం లేదు. ఆ పార్టీల ప్రమేయం ఉన్న అంశాల్లో ఏదైనా పూర్తిగా వారికి చెప్పి ఓకే అన్న తర్వాతనే ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎంపీకి శాఖలు కేటాయించాల్సి ఉంది.
పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆయనకు ఇచ్చే శాఖలపై స్పష్టత లేదు. హోంశాఖ ఇవ్వాలని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదయితే పవర్ ఫుల్ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు.. పవన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఉండే.,..ప్రజలకు ఎక్కువగా హెల్ప్ చేసే శాఖలను ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఆయనకు మూడు, నాలుగు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అలాగే కందుర దుర్గేష్, నాదెండ్ల మనోహర్‌కూ ప్రాధాన్య శాఖలు దక్కనున్నాయి. ఆ శాఖలపై వివరాలను జనసేన, బీజేపీలకు పంపారని.. వారి వైపు నుంచి వచ్చే స్పష్టతను బట్టి ప్రకటన ఉంటుదని అంచనా వేస్తున్నారు.
కేబినెట్ సమావేశానికి ఇంకా కొంత సమయం ఉంది. ఆ సమయంలోపు శాఖలు కేటాయింపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రకటన చేసిన తర్వాత ఎవరూ అసంతృప్తి చెందకుండా ముందుగానే అందరికీ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని… అందర్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపే క్రమంలో చంద్రబాబు … సరైన సమయంలో నిర్ణయాల ప్రకటన చేస్తున్నారని అంటున్నారు.