తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా ఇంకా మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేకపోతోంది.
బీజేపీ, బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దం అవుతుండగా.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్ లలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఖమ్మంలో ఎలాగైనా నెగ్గుతామనే అతి విశ్వాసమే అభ్యర్థి ఎంపికలో జాప్యానికి కారణమా..? అనే సందేహాలు ఉన్నాయి. హైదరాబాద్ సంగతి సరేసరి, కరీంనగర్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ , బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అభ్యర్థి ప్రకటనపై ఆలస్యంతో కాంగ్రెస్ చర్చలోనే లేకుండా పోయింది.
మరికొద్ది రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్నప్పటికీ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. తీరా నామినేషన్ల పర్వం ముగిసాక అభ్యర్థులను ప్రకటిస్తారా..? అని పార్టీలోనే సెటైర్లు పేలుతున్నాయి. ఖమ్మం నుంచి అభ్యర్థుల ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి భట్టి విక్రమార్క భార్య నందినికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టగా ఆయనకు టికెట్ ఖరారు అయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది.
తుమ్మల నాగేశ్వర్ రావు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరి తర్వాత వెనక్కి తగ్గి సన్నిహితుడు మండవ వెంకటేశ్వర్ రావు పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. మధ్యేమార్గంగా మండవ అభ్యర్థిత్వాన్ని రేవంత్ కూడా అంగీకరించారని.. ప్రకటనే తరువాయి అని వార్తలు వచ్చాయి. అయితే, స్థానికేతరుడికి టికెట్ ఇస్తే అంగీకరించబోమని స్థానిక నేతలు చెప్పడంతో మండవ అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గారా ..? అనే సందేహాలు వస్తున్నాయి.
కరీంనగర్ నియోజకవర్గం నుంచి వెలిచాల రాజేందర్రావు – ప్రవీణ్ రెడ్డి మధ్య పోటీ నెలకొనగా.. రాజేందర్ రావు వైపు పార్టీ మొగ్గు చూపిందని ప్రచారం జరిగింది. కానీ, ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో పుణ్యకాలం కాస్త పూర్తయ్యాక కాంగ్రెస్ పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుందా..? అనే సోషల్ మీడియాలో చర్చ విస్తృతంగా జరుగుతోంది.