ఉద్యోగాలు అయితే ప్రకటించారు.. కానీ నోటిఫికేషన్లు ఎప్పటి నుండి అన్న అంశంపై మాత్రం తెలంగాణ నిరుద్యోగులకు స్పష్టత లేకుండా పోయింది. అధికారులు కూడా ఏమీ చెప్పడం లేదు. మీడియాలకు ఇంటర్యూలు ఇస్తున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి కూడా నోటిఫికేషన్లు ఫలానా తేదీ నుంచి వస్తాయని చెప్పడం లేదు. దీంతో నిరుద్యోగుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఉద్యోగాల భర్తీ చేసిన రికార్డు లేకపోవడమే దీనికి కారణం.
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేయడం టీఎస్పీఎస్సీ వల్ల కాదని.. కొత్త బోర్డును ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. గ్రూప్స్ ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసినా… ఇతర పోస్టులన్నీ కొత్త బోర్డుద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి, ఇద్దరు ఐఏఎస్లకు సారథ్యబాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. టెక్నికల్ పరమైన ఉద్యోగాలతో పాటుగా ఇంజినీరింగ్ ఉద్యోగాల నియామకం ఈ బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది.
అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బోర్డు ఏర్పాటు చేసి..భర్తీ చేస్తామని చెప్పడం.. ఆలస్యానికేనని నమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో ఏ మాత్రం నమ్మకం కలిగించలేదు. ఆ తర్వాత తీసుకుంటున్న చర్యలు కూడా అంతే ఉన్నాయి. ఇది ప్రభుత్వంపై నమ్మకం సడలిపోవడానికి కారణం అవుతోంది.