బాహుబలి సెంకడ్ పార్ట్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై ఏడాదిన్నర కావొస్తుంది. ‘బాహుబలి’గా నటించిన ప్రభాస్ ఆ పాత్రను మర్చిపోయి ‘సాహో’ చేస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తీయబోయే సినిమా మీద దర్శకుడు రాజమౌళి దృష్టి పెట్టాడు. దేవసేన పాత్ర నుంచి బయటకొచ్చిన అనుష్క ‘భాగమతి’ చేసింది. తమన్నా రెండుమూడు సినిమాల్లో హీరోయిన్గా, ఒక సినిమాలో ఐటమ్ గాళ్‌గా కనిపించింది. ఆ సినిమాకి పని చేసిన మ్యాగ్జిమమ్ జనాలు ‘బాహుబలి’ ప్రభావం నుంచి బయటకొచ్చి కొత్త సినిమాలు చేస్తున్నారు. రమ్యకృష్ణ మాత్రం ‘బాహుబలి’లో చేసిన శివగామి పాత్ర నుంచి బయటకొచ్చినట్టు కనిపించడం లేదు. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఫస్ట్‌లుక్‌లో రమ్యకృష్ణ ఎక్స్ప్రెషన్ చూశాక… శైలజారెడ్డా? శివగామా? అనే సందేహం వచ్చింది ప్రేక్షకులకు. ఆ సినిమా టీజర్లోనూ ఆమె ఎక్స్ప్రెషన్లు ‘బాహుబలి’లో శివగామిని గుర్తు చేశాయి. ఈసారి ఏకంగా టైటిల్లోనే ఆ పేరును ఉపయోగించారు. ‘రాణి శివగామి’ అనే పేరుతో రమ్యకృష్ణ ఒక సినిమా చేస్తున్నారు. హైదరాబాద్‌లో బోనాల పండగ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. కాస్ట్యూమ్ మారిందేమో కానీ… రమ్యకృష్ణ ఎక్స్ప్రెషన్ మాత్రం సేమ్ టు సేమ్ శివగామి. కళ్లు పెద్దవి చేసి కోపంతో ఉన్న లుక్ ఇచ్చారు. ఆ పాత్ర నుంచి రమ్యకృష్ణ, ఆమెతో సినిమాలు చేయాలనుకునే దర్శక నిర్మాతలు ఎప్పుడు బయటకొస్తారో? ప్రేక్షకులకు మొహం మొత్తితే కష్టం అవుతుంది!