ఓ ఫైన్ ఈవినింగ్ .. ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రసార మంత్రి పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి.. సీఎం గారు అపాయింట్ మెంట్ ఖరారు చేస్తారు .. సినీ పరిశ్రమ సమస్యల అజెండా రెడీ చేసుకోమని సలహా ఇచ్చారు. అంతే చిరంజీవి కూడా సంతోషపడ్డారు..వెంటనే ఇండస్ట్రీలోని ప్రముఖులందర్నీ పిలిచి.. సమస్యలేంటి ఎలాంటి పరిష్కారాలు కావాలి అనేదానిపై సమావేశం నిర్వహించి ఎజెండా ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత పేర్ని నాని కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. చిరంజీవి కూడా శాలువాతో సన్మానించారు. అంత వరకూ బాగానే ఉంది. నెలాఖరులో సమావేశం ఉంటుందని హింట్ ఇచ్చారు కానీ… అలాంటి సమావేశం ఏదీ జరిగే అవకాశం ఉందని కానీ.. ఫలానా రోజు అపాయింట్ మెంట్ ఖరారైందన్న సమాచారం కానీ లేదు. అంతా సైలెంటయిపోయారు.
దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ప్రభుత్వం సృష్టించిన ప్రధాన మైన సమస్య ఉంది. అది టిక్కెట్ రేట్లు. పదేళ్ల కిందటి ధరలు ప్రభుత్వం నిర్ణయించడంతో అ ధరలు వర్కవుట్ కావని ఎగ్జిబిటర్లు కూడా ధియేటర్లు తెరవడం లేదు. నిర్మాతలు కూడా సుముఖంగారు. టాలీవుడ్ నుంచి ఏ సమస్య అయినా ముందుగా పరిష్కారం కావాలంటే టిక్కెట్ రేట్ల సమస్యే. దాని కోసం చిరు బృందం సీఎం జగన్ వద్ద ప్రస్తావించాలని నిర్ణయించుకోవడం సహజమే. అయితే మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి .. చిరు టీంతో భేటీ అయి వెళ్లిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు.
మంత్రి పేర్ని నాని… సమస్య పరిష్కారం చేయడానికి ఏదో ఆశించారని.. ఇంకేదో డిమాండ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆ డిమాండ్‌ను పరిష్కరించడం సినీ పెద్దలకు తలకు మించిన భారంగా మారడం వల్లే జగన్‌తో భేటీ గురించి చప్పుడు లేదని అంటున్నారు. ఒక వేళ మంత్రి పేర్ని నాని ఆ డిమాండ్ విషయంలో మెత్తబడి సరే .. రండి అంటే మీటింగ్ జరగవచ్చని లేకపోతే… జరగకపోవచ్చని అంటున్నారు. టాలీవుడ్లో ఇప్పుడు పేర్ని నాని చేసినట్లుగా చెబుతున్న డిమాండే హాట్ టాపిక్ అవుతోంది.