వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం లేదు. తాజాగా గత ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామని మోసం చేసి జీపీఎస్ అనే విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ గ్యారంటీ పెన్షన్ స్కీం గెజిట్ నోటిఫికేషన్ టీడీపీ ప్రభుత్వంలో వెలువడింది.
దీంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు, వైసీపీ తీసుకొచ్చిన జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేస్తామని మాటిచ్చారు. కానీ జూన్ 12న జీవో జారీ అయింది. గెజిట్ కూడా వచ్చింది. దీంతో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. తమ నేతలు ఎక్కడ ఉన్నారో అని వెదుక్కోవడం ప్రారంభించారు. నిజానికి ఈ జీపీఎస్ కు వారు ఆమోదం తెలిపారు. అందుకే వ్యతిరేకించలేరు. వైసీపీ హయాంలో ఆమోదించి.. ఇప్పుడు వ్యతిరేకిస్తే.. ప్రభుత్వం కన్నెర్ర చేస్తుంది.
ఉద్యోగుల్ని నిలువునా ముంచిన ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడు బయటకు రావడం లేదు. కనీసం చిన్న ప్రకటన కూడా చేయడం లేదు. వెంకట్రామిరెడ్డి అనే సచివాలయ సంఘం ఉద్యోగ నేతను ఈసీ సస్పెండ్ చేసింది. ఆయన అసలు కనిపించడం లేదు. వైసీపీ గెలిస్తే ఏదో వస్తుందని బావుకున్నవాళ్లంతా సైలెంట్ గా ఉంటున్నారు. ఉద్యోగులు బలైపోతున్నారు.