ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి జమానాలో ఆ ఇద్దరూ ఓ వెలుగు వెలిగారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలలోనూ ఆ ఇద్దరూ తమ హవా చాటారు. ఆ ఇద్దరిలో ఒకరు ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకంగా దించేస్తే.. మరొకరు దక్షిణాదిలో ఓ రాష్ట్రంలో పార్టీ అధికారం కోసం పాటు పడ్డారు. బీజేపీ అధిష్టానం చేత ఆ ఇద్దరూ వీరులు… సూరులూ అని పేరు తెచ్చుకున్నారు.
ప్రధానమంత్రిగా రెండవసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరి ఊసే లేకుండా పోయింది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు అనుకుంటున్నారా..!?
ఆ ఇద్దరూ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శులుగా ఓ వెలుగు వెలిగిన రామ్ మాధవ్… మురళీధర్ రావు. ఈ ఇద్దరిలో రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకుడు కాగా మురళీధర్ రావు తెలంగాణ నాయకుడు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు నాయకులు వినిపించడమే కాదు కనీసం కనిపించడం కూడా లేదు. దీనికి కారణం వారు చేసిన వ్యాఖ్యలు, వారిపై వచ్చిన ఆరోపణలే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్ మాథవ్ ఆర్ ఎస్ ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడిగా వ్యవహరించారు. కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహహణతో పాటు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ వంటి అంశంలోనూ కీలకంగా వ్యవహరించారు. అంతటి కీలక వ్యక్తి ప్రస్తుతం మౌనముద్రలో ఉన్నారు. దీనికి కారణం ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. గతంతో పోలిస్తే పార్టీకి ఈసారి తక్కువ స్ధానాలు వస్తాయని ఎన్నికలకు ముందు రామ్ మాధవ్ వ్యాఖ్యనించారు. అంతే ఎన్నికల తర్వాత ఆయనను పక్కన పెట్టింది బీజేపీ అధిష్టానం. పార్టీలో తన మాటే వేదంగా చెల్లుబాటు చేసుకున్న రామ్ మాధవ్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయింది.
ఇక రెండో నాయకుడు మురళీధర్ రావు. ఈయన కూడా కర్నాటక ఎన్నికల అనంతరం వ్యవహరించిన తీరుపై అధిష్టానం గుర్రుగా ఉంది. మెజారిటీ తక్కువగా ఉన్న సమయంలో యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆ రాష్ట్ర బాధ్యుడిగా ఉన్న మురళీధర్ రావు అత్యుత్సాహం చూపారని, దీని కారణంగా పార్టీ పరువు పోయిందని విమర్శలొచ్చాయి. ఈ వివాదం సమయంలో పార్టీ అధిష్టానం మురళీధర రావును వెనక్కి వచ్చేయాలని కూడా ఆదేశించింది. దీంతో పాటు కీలక పదవులు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు మురళీధర రావు. ఈ వివాదాల కారణంగా ఆయనను పార్టీ పక్కన పెట్టిందని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ నాయకులను భారతీయ జనతా పార్టీ అధిష్టానం పక్కన పెట్టడం ఈ రాష్ట్రాల నాయకులకు ఇబ్బందిగా మారింది.