వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కనిపించడం లేదు. విజయనగరం జిల్లా పర్యటనకు జగన్ వెళ్లారు. కానీ బొత్స మాత్రం రాలేదు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు మొత్తం కార్యక్రమాలను నడిపారు. బొత్స ఫ్లెక్సీలు కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో బొత్స రాకపోవడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయన వీలైనంతగా జగన్ కు దూరం పాటిస్తున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల్లో ఓడిపోవడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఒక్కడు కాదు మొత్తం కుటుంబం అంతా ఓడిపోయింది. తరవాత టీడీపీ పోటీ చేస్తే ఉంటుందో ఊడుతుందో తెలియని ఎమ్మెల్సీకి బలవంతంగా అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ పోటీ చేయకపోవడంతో ఎమ్మెల్సీ అయ్యారు. ఉత్తరాంధ్ర పెద్ద దిక్కుగా పార్టీ బాధ్యత అంతా తనకే ఉంటుందని అనుకుంటే మళ్లీ విజయసాయిరెడ్డిని తెచ్చి విశాఖలో పెట్టారు. ఆయన ఎంట్రీ ఇచ్చి మళ్లీ బొత్సకు పని లేకుండా చేశారు. ఈ అరాచకాలతో బొత్స విసిగిపోయారని వైసీపీ నేతలంటున్నారు.
గుండెకు ఆపరేషన్ చేయించుకున్న ఆయన రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటున్నారు. ప్రెస్మీట్లు పెట్టడం తప్ప ఇక ఎక్కడా ఆవేశపడకూడదని అనుకుంటున్నారు. మరో ఆరు నెలలు చూసి వైసీపీకి రాజకీయ భవిష్యత్ ఉంటుందా లేదా అన్నది డిసైడ్ చేసుకుని ఆయన పార్టీ ఫిరాయించే అవకాశం ఉంది. వెళ్తే ఆయన ఒక్కరే వెళ్లరని కుటుంబం మొత్తం వెళ్తుందని విజయనగరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.